Plane Crash : ఇటీవల విమాన వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ సూడాన్‌లోని యూనిటీ స్టేట్‌లో చమురు కార్మికులతో వెళ్తున్న ఓ విమానం బుధవారం సాయంత్రం కూలిపోయింది. ఇది మినీ విమానం కావడంతో అందులోని 20 మంది మరణించినట్లు ఆదేశ అధికారులు ధృవీకరించారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా.. గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ (GPOC) ఉద్యోగులని తెలుస్తోంది. ఇది.. చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్, ప్రభుత్వ యాజమాన్యంలోని నైల్ పెట్రోలియం కార్పొరేషన్‌తో కూడిన కన్సార్టియం సంస్థ అని యూనిటీ స్టేట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ గట్వెచ్ బిపాల్ తెలిపారు.
ఈ సంస్థలో పని చేస్తున్న కార్మికులతో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఇందులో ఓ భారతీయుడు సహా ఇద్దరు చైనా పౌరులు చనిపోయినట్లుగా అక్కడి అధికారులు తెలిపారు. తొలుత ప్రమాదంలో 18 మంది మరణించగా, ఇద్దరు ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ సూడాన్ లో గతంలోనూ అనేక వైమానిక విపత్తుల్ని చవిచూసింది. 2018 సెప్టెంబర్, జుబా నుంచి యిరోల్‌కు ప్రయాణీకులను తీసుకెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోగా అందులోని 19 మంది ప్రయాణికులు మరణించారు. అలాగే.. 2015లో జుబా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రష్యా నుంచి కొనుగోలు చేసిన కార్గో విమానం కూలిపోయి అనేక మంది మృత్యువాత పడ్డారు.
కాగా.. విమాన ప్రమాద వార్త అందుకున్న అత్యవసర ప్రతిస్పందనా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ప్రమాదానికి కారణాలు తెలియలేదని సూడాన్ అధికారులు వెల్లడించారు.