Big Stories

Mumbai: కాలుష్యంలో ఢిల్లీని తలదన్నిన ముంబై

Mumbai: కాలుష్యంలో దేశ రాజధాని ఢిల్లీని ఆర్థిక రాజధాని ముంబై తలదన్నింది. ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ప్రపంచ కాలుష్యనగరాల జాబితాలో గత నెల 29న పదో స్థానంలో నిలిచిన ముంబై…. ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలో అగ్రభాగాన చేరింది.

- Advertisement -

స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ ఈ మేరకు కాలుష్య నగరాలకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. ఐక్యూ ఎయిర్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో కాలుష్య తీవ్రతను పర్యవేక్షించే రియల్ టైం మానిటర్. యూఎన్ఈపీ, గ్రీన్‌పీస్‌తో కలిసి ఎప్పటికప్పుడు…. కాలుష్యం, గాలి నాణ్యత వివరాలను అందిస్తుంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటాను పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్ కన్నా అత్యంత కఠిన ప్రమాణాలను పాటించే అమెరికా గాలి నాణ్యత సూచీ మేరకు కాలుష్య తీవ్రతను లెక్కిస్తుంది.

- Advertisement -

మూడు నెలలుగా ముంబైలో ఎయిర్ క్వాలిటీ అత్యంత దారుణంగా పడిపోయింది. గత మూడు శీతాకాల సీజన్ల కన్నా ఈ సారి కాలుష్యం ఎక్కువగా నమోదైనట్టు సీపీసీబీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాహనాల పొగ, రహదారులు, భవన నిర్మాణాలతో దుమ్ము, ధూళి అనూహ్యస్థాయిలో పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. లానినా వల్ల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి పడిపోయాయి. దీని వల్ల పశ్చిమ తీరంలో గాలుల వేగం తగ్గి.. కాలుష్యకారకాలు ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా గాలి స్వచ్ఛత తగ్గింది. ముంబై పరిసర ప్రాంతాల్లోని గాలిలో 71% కాలుష్య కారకాలు రోడ్లు, భవన నిర్మాణాల వల్లేనని నీరి, ఐఐటీ-బాంబే పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. మిగిలిన కాలుష్యం ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లు, ఎయిర్‌పోర్టులు, వేస్ట్ డంప్స్ నుంచేనని…. 2020 నాటి ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇక అత్యంత కాలుష్య నగరాల్లో సరయెవో టాప్‌లో నిలిచింది. బోస్నియా-హెర్జ్‌గోవినా రాజధాని అయిన ఈ నగరంలో ఏక్యూఐ 186గా ఉంది. 163 ఏక్యూఐతో ముంబై రెండో స్థానంలో, 162తో మిలానో మూడో స్థానంలో నిలిచింది. ఇక టాప్ టెన్ కాలుష్య నగరాలను తీసుకుంటే తర్వాతి స్థానాల్లో కోల్‌కతా, లాహోర్ , క్రస్నాయార్హ్ ప్రిస్టినా, హనోయ్ , కరాచీ , లండన్ ఉన్నాయి.

ముంబైతో పాటు ఢిల్లీలో కాలుష్యం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మనిషి మనుగడే ప్రశ్నార్ధకంగా మారే అవకాశముందంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News