Pakistan elections: పాకిస్థాన్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపిస్తూ.. సీనియర్ అధికారి రాజీనామా చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో సోషల్ మీడియాపై అప్రకటిత ఆంక్షలు అమలవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారంలో ఏకంగా సీఈసీ, సీజే హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఆ దేశ ఎన్నికల కమిషన్ వీటిని తోసి పెట్టింది. వీటిపై దర్యాప్తు చేయడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఎన్నికల కమిషన్ నియమించింది.
ఈ అంశంపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో ఈసీ సికందర్ సుల్తాన్ రజా హాజరయ్యారు. రిగ్గింగ్ కు సంబంధించిన దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేసిన కమిటీ ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసుకొని మూడు రోజుల్లో నివేదికను ఎన్నికల కమిషన్‌కు అందజేయనుంది. మరో వైపు ఈ ఆరోపణలను రావల్పిండి కమిషనర్ సయీఫ్ అన్వర్ జప్పా పూర్తిగా తోసిపుచ్చారు. తమ పాత్ర ఎన్నికల్లో కేవలం సమన్వయం వరకే పరిమితం అవుతుందని ఆయన పేర్కొన్నారు. సైనిక నాయకత్వం కొలువుదీరి ఉండే రావల్పిండిలో దాదాపు 13 మంది అభ్యర్థులను బలవంతంగా విజేతలుగా ప్రకటించామని రావల్పిండి మాజీ కమిషనర్ లియాఖత్ అలి ఛత్తా ఆరోపించడం సంచలనం సృష్టించింది.
పాకిస్థాన్‌లో సామాజిక మాధ్యమం ఎక్స్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందని నెట్‌బ్లాక్స్ అనే సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల అవకతవకలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తడం గమనార్హం. ఎన్నికల్లో అవకతవకలపై ఓ సీనియర్ అధికారి రాజీనామా చేసిన తర్వాత ఇలా జరిగిందని ఆ సంస్థ వెల్లడించింది.
Read More: నావల్నీ మృతదేహం అప్పగింతకు నో?
పాక్ లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పీటీఐ మద్దతున్న 93 మంది అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. వాస్తవానికి తమకు పూర్తి మెజార్టీ వచ్చినా.. ఫలితాలను ప్రకటించకుండా జాప్యం చేసి ఆపై తారుమారు చేశారని ఆరోపించారు. తాజాగా వీటిపై పీటీఐ ఆందోళనలు చేపట్టింది.