Revenge for Gaza: ఫ్లైదుబాయ్ కో-పైలట్ హుమామ్ అల్-హమ్మామి విచారణలో ఏం చెప్పబోతున్నాడు? విమానం హైజాక్ కుట్ర తనదేనని అంగీకరిస్తాడా? దీని వెనుక దేశాలు లేకుంటే కీలకమైన వ్యక్తులు ఉన్నారని చెబుతారా? కాకపోతే బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో విమానం కూల్చివేయాలన్నది అతగాడి ప్లాన్‌గా తెలుస్తున్నట్లు దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ పత్రికలు పేర్కొన్నాయి.
విమానంపై ఉగ్రదాడికి యత్నం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్లైదుబాయ్ సహ-పైలట్ హుమామ్ అల్-హమ్మామి విచారణ లోతుగా సాగుతోంది. దీంతో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. నిందితుడు ఆలోచన చూస్తుంటే ఇజ్రాయెల్ టార్గెట్‌గా అడుగులు వేసినట్టు విచారణలో వెల్లడైన విషయాలు బట్టి తెలుస్తోంది. దుబాయ్‌కు చెందిన ఫ్లైదుబాయ్ కంపెనీలో ఉద్యోగం రాకముందు బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని కూల్చివేయాలని ప్రణాళిక వేసుకున్నాడట.
ఈ విషయాన్ని దర్యాప్తుతో పరిచయం ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులను ఉటంకిస్తూ ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓ కథనాన్ని రాసుకొచ్చింది. గాజాకు ప్రతీకారం తీర్చుకోవడానికే తాను ఈ చర్యకు పాల్పడ్డానని చెప్పాడట. అమరవీరుడిగా మరణించాలని కోరుకున్నానని అల్-హమ్మామి చెప్పినట్లు సమాచారం. అల్-హమ్మామి ఈ ఏడాది ప్రారంభంలో టెల్ అవీవ్‌కు విమానంలో ప్రయాణించి అక్కడ విమానాన్ని హైజాక్ చేసి కూల్చివేయాలని భావించాడట. అతడు ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది.
ఇటీవలకాలంలో అల్-హమ్మామి ఇజ్రాయెల్‌కు శత్రుదేశాల్లో స్వల్ప పర్యటనలు చేశాడని ఇజ్రాయెల్ గూడచారి సంస్థ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారి ఇజ్రాయెల్ క్యాబినెట్ మంత్రులకు చెప్పినట్లు పేర్కొన్నాయి. టెల్ అవీవ్‌కు విమానాలు నడిపే విమానయాన సంస్థల గురించి తెలుసుకున్న తర్వాత ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు హుమామ్. ఇటాలియన్ వార్తాపత్రిక కొరియెర్ డెల్లా సెరా నివేదించిన ప్రకారం.. మచ్ఛార్‌పై దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు అల్-హమ్మామి ప్రార్థన విరామం కోరాడు. ఆ తర్వాత జరిగిన ఘటనలో గాయపడినప్పటికీ కెప్టెన్ కాక్‌పిట్ తలుపును తెరిచాడని, దీంతో ప్యాసింజర్ క్యాబిన్‌లో ప్రయాణిస్తున్నవారిని అలర్ట్ చేశారని, విధుల్లో లేని పైలట్‌ను అప్రమత్తం చేసినట్టు రాసుకొచ్చింది.
ALSO READ: కూలిన సైనిక విమానం.. 32 మంది మృతి, నైజీరియాలో ఘటన
ఆ తర్వాత ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లి అల్-హమ్మామిని అదుపులోకి తీసుకురావడానికి సహాయపడ్డారని ప్రస్తావించింది. తొలి ప్రణాళికకు భంగం వాటిల్లిన తర్వాత అల్-హమ్మామీ విమానాన్ని నిటారుగా కిందికి దించి నియంత్రణలను దెబ్బతీయడానికి ప్రయత్నించాడని పేర్కొంది. ఎడారిలో విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడని, విధుల్లో లేని పైలట్లు విమానాన్ని స్వాధీనం చేసుకుని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు రాసుకొచ్చింది. ఆ తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించగా అక్కడ ఉదయం 10.57 గంటలకు ల్యాండైంది. విమానంలో 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు, వారిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ జాతీయులు ఉన్నారు.