Romance Scam In China : ప్రేమ పేరుతో నమ్మించి అప్పటి చిన్ని చిన్న అవసరాలకు వినియోగించుకుని వదిలించుకునే ప్రేమికుల్ని చూసుంటాం. లేదంటే.. ప్రేమ అని నటించి కొన్నాళ్లు కలిసి ఉండి కొద్దిపాటి సొమ్ముల్నో వెనుకేసుకునే ఉదంతాలను సైతం చూసుంటాం. కానీ.. చైనాలో మాత్రం ప్రేమ పేరుతో ఏకంగా ప్రాపర్టీ స్కామ్ జరిగింది. ప్రేమ పేరుతో ఒక్కరిని, ఇద్దరిని కాదు.. ఏకంగా 36 మందిని నమ్మించి బురిడీ కొట్టించిందో మాయ లేడి. ఒకరికి తెలియకుండా.. మరొకరితో ఆమె సాగించిన నకిలీ ప్రేమకథ బయటపడడంతో పాటు ఆమె చేసిన మోసం వెలుగులోకి రావడంతో.. ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఒక్కరిని, ఇద్దరిని మోసం చేసిన ఘటనలు చూసుంటాం కానీ.. ఏకంగా 36 మంది యువకుల్ని మోసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ పని చేసింది.. ఓ 30 ఏళ్ల యువతి. ఈమె చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఈ తన పేరు లియు జియాగా పరిచయం చేసుకుని యువకులకు దగ్గరైన ఈ యువత.. తన మాటలతో వాళ్లను కట్టిపడేసింది. మన ప్రవర్తనతో వాళ్లను ప్రేమ మైకంలో దింపేసింది. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఆమె ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్ చేసింది. దాంతో.. వాళ్లంతా ఆమె ఉచ్చులో పడిపోయారు.
నెమ్మదిగా బాధితుల్ని తన ప్రేమ గుప్పిట బధించిన లియు జియా.. ఆపై తన అసలు నాటకానికి తెరలేపింది. ఈమె ప్రేమ మైకంలో పడిన వాళ్లంతా 30 ఏళ్ల లోపు యువకులే కావడంతో.. వారిని తనకు లోబరుచుకున్న ఈ యువతి.. తమ మాటల్ని గుడ్డిగా నమ్మేలా మాయ చేయగలిగింది. ఒక్కొక్క యువకుడిని ప్రేమ పేరుతో దగ్గరైన ఈ యువతి.. అటుపై తనతో డేటింగ్ చేయాలన్నా, ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలన్నా.. అబ్బాయికి సొంతిళ్లు ఉండాలని పట్టుపట్టింది. వాళ్లను బలవంతంగా ఇళ్లు కొనుక్కునేలా ప్రోత్సహించిన ఈ యువతి.. సమీపంలోని హుయిజౌ నగరంలో ఫ్లాట్లు కొనాలని ప్రలోభపెట్టింది. తనతో జీవితం హాయిగా సాగించాలంటే హుయిజౌలో ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలని వారిని నాజూగ్గా ఒప్పించింది.
ఈ స్కామ్‌కు బలైన వ్యక్తుల్లో ఒకరు అటావో (మారుపేరు). లియు తనను షెన్‌జెన్‌లోని ఒక ఈ-కామర్స్ కంపెనీలో ఉద్యోగిగా పరిచయం చేసుకుంది. ఆమె హునాన్ ప్రాంతానికి చెందినదగా పరిచయం చేసుకుందని వెల్లడించారు. అతనితో ఆ యువతి కొన్ని నెలల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత, హుయిజౌలో అపార్ట్‌మెంట్ కొనాలని ఒత్తిడి చేసింది. ఇది మన భవిష్యత్ కోసం అంటూ.. తన తల్లిదండ్రులను కలిసేందుకు ముందుగా సొంత ఇళ్లు ఉండాలని ఒప్పించింది. అంతే కాదు.. కొత్త ప్లాటు కొనేందుకు.. అతనికి నమ్మకం కలిగించేందుకు లియు మొదటగా డౌన్ పేమెంట్ చెల్లించేందుకు సిద్ధమైంది.
Also Read : US Halts Satellites Service Ukraine: ట్రంప్‌తో జెలెన్‌స్కీ వాగ్వాదం.. ఉక్రెయిన్‌కు కీలక శాటిలైట్ సాయం కట్
ఆమె మొదటిగా ప్లాట్ అడ్వాన్స్ గా తన జేబు నుంచి 30,000 వేల యువాన్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 3.6 లక్షలు కట్టింది. ఆమె చొరవతో.. నిజంగానే వారి బంధం కోసమే ఆమె అలా చేస్తుందని భావించిన యువకుడు.. ఆమెపై మరింత నమ్మకం కలిగింది. దాంతో.. అతను బ్యాంకు లోన్లు తీసుకుని సదరు ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కానీ.. నెమ్మదిగా అసలు విషయం బోధపడలేదు. లియు వ్యవహారశైలిలో క్రమంగా మార్పు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత.. ఆమె అటావోను పూర్తిగా దూరం చేయడం ప్రారంభించింది. ప్రేమ అంటూ దగ్గరకు వచ్చిన ఆ యువతి.. చివరకు అతను ఆమెను సంప్రదిచేందుకు సైతం వీలు లేకుండా పోయింది. ఈ మోసం కారణంగా అతను ప్రతీ నెల 4,100 యువాన్లు అంటే.. రూ. 49,317 ఈఎమ్ఐ కట్టాల్సి వస్తుందని వాపోతున్నాడు. అతనిలా.. మరో 35 మంది యువకులదీ అదే పరిస్థితి.