CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఎల్లుండి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు.
ALSO READ: CM Revanth Reddy: మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్..
హస్తం పార్టీలో ఇప్పటికే పలువరు కీలక నేతలతో ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఎవరికి ఏ పదవులు కావాలో వారినే అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది పదవుల కోసం హస్తినకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.
రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, తుది జాబితాపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించాక ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలపై తుది ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.