BigTV English

Golden Dome: గోల్డెన్ డోమ్ పేరు చెబితే ఉలిక్కి పడుతున్న రష్యా, చైనా.. ఎందుకంటే..?

Golden Dome: గోల్డెన్ డోమ్ పేరు చెబితే ఉలిక్కి పడుతున్న రష్యా, చైనా.. ఎందుకంటే..?

గోల్డెన్ డోమ్ పేరుతో అమెరికా ఒక క్షిపణి రక్షణ వ్యవస్థను రెడీ చేసుకుంటోంది. దీనికోసం ఏకంగా 175 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి ఇతర దేశాలన్నీ ఆసక్తి వ్యక్తం చేస్తున్న సమయంలో రష్యా, చైనా మాత్రం ఆందోళన వెలిబుచ్చడం విశేషం. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రయత్నాన్ని విరమించుకోవాలంటోంది చైనా. అమెరికా చర్యలు అణు యుద్ధాలకు దారితీయొచ్చని, ప్రపంచంలోని దేశాల మధ్య మరిన్ని అంతరాలకు కారణం కావొచ్చని రష్యా అనుమానం వ్యక్తం చేస్తోంది. అసలింతకీ గోల్డెన్ డోమ్ తో ఆ రెండు దేశాలకు వచ్చిన నష్టమేంటి..? ఆ పేరు చెబితేనే రష్యా, చైనా.. ఎందుకు వణికిపోతున్నాయి.


గోల్డెన్ డోమ్ పేరుతో అమెరికా తనకు తాను ఓ రక్షణ వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. ఎవరూ దీన్ని కాదనలేరు, అడ్డు చెప్పలేరు. క్షిపణి రక్షణ వ్యవస్థ అంటే.. అమెరికా భౌగోళిక పరిధిలో ఒక వ్యవస్థను సిద్ధం చేసుకుని, క్షిపణులు ఆ దేశంపైకి వస్తే వాటిని అడ్డకునే వ్యవస్థ. అయితే గోల్డెన్ డోమ్ కి మరింత విస్తృత అర్థం ఉంది. అంతరిక్షంలో కూడా ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే స్టార్ వార్స్ తరహాలో అంతరిక్షంలోనే ఒక వ్యవస్థను సిద్ధం చేయడం. అంటే గోల్డెన్ డోమ్ లో భాగంగా ఒక సర్వైవలెన్స్ శాటిలైట్, ఇంటర్ సెప్టార్ శాటిలైట్ ఉంటాయి. ఇతర దేశాలనుంచి వచ్చే క్షిపణులను ఒక శాటిలైట్ నిర్థారిస్తుంది, దాని గమనాన్ని అంచనా వేస్తుంది. మరో శాటిలైట్.. వాటిని నాశనం చేయడానికి అవసరమైన అటాకింగ్ వ్యవస్థను రెడీ చేస్తుంది. ఇక్కడే చైనా, రష్యా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి శాటిలైట్ సిస్టమ్ వల్ల గోల్డెన్ డోమ్ అనేది మరింత శక్తిమంతంగా మారుతుంది. అంటే ఇతర దేశాల సామర్థ్యాలను ఇది మరింతగా దెబ్బతీస్తుంది.

పైకి చెబుతున్నట్టుగా గోల్డెన్ డోమ్ అనేది కేవలం రక్షణ తంత్రం కాదు, అంతకు మించి అని రష్యా, చైనా అనుమానిస్తున్నాయి. ఇతర దేశాలపై నిఘా పెట్టేందుకు, ఇతర దేశాల ఆయుధ సంపత్తిని ఆ దేశంలోనే నిర్వీర్యం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ డోమ్ ని తెరపైకి తెస్తున్నారని ఆయా దేశాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఇది అమెరికా సార్వభౌమాధికారానికి చెందిన విషయం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని సూక్ష్మ అంశాలను ఆ దేశం బయటపెట్టడం లేదని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోల్డెన్ డోమ్ అనేది కేవలం క్షిపణి రక్షణ కవచం కాదని, శత్రువులపై దాడి చేయగల బలమైన వ్యవస్థను అది కలిగి ఉంటుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.


అణ్వాయుధాల నియంత్రణపై ఇప్పటికే అన్ని దేశాలు కొన్ని కట్టుబాట్లను గౌరవిస్తున్నాయని, గోల్డెన్ డోమ్ తో ఆ కట్టుబాట్లకు అమెరికా చరమగీతం పాడినట్టవుతుందని చైనా, రష్యా అంటున్నాయి. అదే జరిగితే, ఇతర దేశాలు కూడా రక్షణ వ్యవస్థల పేరుతో కొత్త ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకుంటాయని, ఇది ప్రపంచ వినాశనానికి తొలి అడుగు అవుతుందని వారు అంటున్నారు. అమెరికా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. తమది కేవలం రక్షణ వ్యవస్థ అని చెబుతోంది.

ఇలా ఒక దేశంపై మరొక దేశం వంతులు పెట్టుకుని అణ్వస్త్రాల విషయంలో కీలక ఒప్పందాలను రద్దు చేసుకున్న ఉదాహరణలు కూడా గతంలో ఉన్నాయి. 1972 యాంటీ-బాలిస్టిక్ క్షిపణి ఒప్పందం, 1987లో ఇంటర్మీడియట్-రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందాలు రద్దు కావడానికి రష్యాయే కారణమని అప్పట్లో అమెరికా ఆరోపించింది. రష్యా పేరు చెప్పి.. రష్యా ఆ నిబంధనలు ఉల్లంఘించిందనే సాకుతో.. అమెరికా కూడా ఆయా ఒప్పందాలనుంచి వైదొలగింది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశముంది. అమెరికా గోల్డెన్ డ్రోమ్ సాకుతో.. చైనా, రష్యా దుందుడుకు చర్యలకు పాల్పడే ప్రమాదం ఉంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×