Big Stories

Russia Missile On Poland : పోలండ్ దేశంలో పడిన రష్యా మిస్సైల్.. దాడి చేయలేదంటున్న రష్యా..

Russia Missile On Poland :జీ20 సదస్సు వేళ రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా విరుచుకుపడుతోంది. ఐతే ఓ మిస్సైల్ పోలాండ్ భూభాగంలో పడడం ఇప్పుడు దుమారం రేపుతోంది. మేడిన్ రష్యా మిసైల్ తమ భూభాగంలో పడి, ఇద్దరు పౌరులు చనిపోయారని పోలాండ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

నవంబర్ 15న ఉక్రెయిన్‌పై రష్యా బాంబు దాడులు చేసిందని.. ఆ సమయంలో తమ దేశంలో ఓ క్షిపణి పడిందని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డ్యుడా తెలిపారు. క్షిపణి పడి ఇద్దరు వ్యక్తులు మరణించారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత రష్యా, పోలాండ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలని రష్యా రాయబారిని పోలాండ్ ప్రభుత్వం ఆదేశించింది

- Advertisement -

మరోవైపు పోలాండ్ క్షిపణిదాడి ఆరోపణలను రష్యా ఖండించింది. ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తమ సైన్యం ఎలాంటి దాడి చేయలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేశారు. రష్యా మిసైల్ దాడితో పోలాండ్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని తూర్పు ప్రాంతంలో పేలుడు అనంతరం.. పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డ్యుడా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ , UK ప్రధాని రిషి సునక్‌ , జర్మన్ ఛాన్స్‌లర్ తో ఫోన్‌లో మాట్లాడారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునక్ ప్రస్తుతం ఇండోనేసియాలో ఉన్నారు. జీ20 సదస్సు నేపథ్యంలో బాలిలో పర్యటిస్తున్నారు. రష్యా మిసైల్ దాడి గురించి తెలిసిన వెంటనే.. రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ దేశాల సరిహద్దుల్లో తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రష్యా దాడిని ఆయన ఖండించారు. పోలాండ్ దర్యాప్తుకు తన మద్దతును ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్.. నాటో దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జీ20 సదస్సులో ఉన్నప్పటికీ.. దానిని పక్కనబెట్టి అందుబాటులో ఉన్న జీ7, నాటో దేశాల సభ్యులతో ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పోలాండ్‌లో రష్యా క్షిపణులు పడిపోయినట్లు వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు నాటో తెలిపింది. ఇక ఉక్రెయిన్ సరిహద్దులో పేలుళ్లు జరగడంతో అప్రమత్తంగా ఉండాలని పోలాండ్ తన సైన్యాన్ని కోరింది. అదనపు బలగాలను సరిహద్దులకు తరలిస్తోంది.

కానీ రష్యా మాత్రం తాము పోలాండ్ భూభాగంపై మిసైల్స్‌ దాడి చేయలేదని.. వార్తల్లో చూపిస్తున్న క్షిపణి శకలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఒకవేళ రష్యా ఉద్దేశ్యపూర్వకంగానే మిస్సైల్‌తో దాడి చేస్తే మాత్రం.. నాటో దళాలు ప్రతి చర్యకు దిగే అవకాశముంది. ఇదే జరిగితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తీసుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News