RIP Krishna : సూపర్‌స్టార్ కృష్ణ అనారోగ్యంతో మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని నానక్‌రామ్ గూడలోని నివాసంలో ఉంచారు. పలువురు రాజకీయ.. సినీ ప్రముఖులు కృష్ణకు నివాళులు అర్పించి హీరో మహేష్, ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. అయితే దేశంలోనే మరెవరికీ లేనంత మంది ఫ్యాన్స్ అసోసియేషన్స్ కృష్ణకి ఉన్నాయి. ఏకంగా 2500 అభిమాన సంఘాలు కృష్ణకు ఉన్నాయి. తమ అభిమాన హీరో చనిపోయారని తెలుసుకున్న ఆయన అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందుగానే ఊహించిన కుటుంబ సభ్యులు.. గచ్చిబౌలి స్టేడియంలో చివరి చూపు కోసం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచాలని అనుకున్నారు. అయితే నానక్ రామ్ గూడలో ఆలస్యం కావటంతో డిసిషన్ మారింది. దీంతో గచ్చిబౌళికి కాకుండా పద్మాలయా స్టూడియోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఫ్యాన్స్ అందరూ మళ్లీ గచ్చి బౌళి నుంచి నానక్ రామ్ గూడ వచ్చారు. అయితే అక్కడ వారికి పర్మిషన్ దొరకలేదు. దీంతో జోహార్ కృష్ణ అంటూ, తమకు కడ చూపు చూసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ఫ్యాన్స్ ధర్నా చేశారు. ఏదైతేనేం పద్మాలయా స్టూడియోలో ఇప్పుడు అభిమానులకు సందర్శన కోసం అనుమతి ఇచ్చారు.