Russia To India Train: రష్యా నుంచి ఇండియాకు రైల్వే కనెక్టివిటీ సాధ్యమేనా? మాస్కో పాలకుల ఆలోచన సరైనదేనా? ప్రతిపాదన తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఈ మార్గం తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల గుండా వెళ్లే అవకాశం ఉందన్నది అసలు ప్రతిపాదన. ఇది నిజమవుతుందా? అన్నదే అసలు ప్రశ్న.
భారత్ నుండి రష్యాకు రైలు సర్వీసును ఏర్పాటు చేయాలనే ఆలోచనను బయటపెట్టింది మాస్కో. దీనిపై రష్యా ఉప ప్రధాన మంత్రి మారత్ ఖుస్నుల్లిన్ నోరు విప్పారు. రష్యా వార్తా సంస్థ టాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందూ మహాసముద్రానికి భూమార్గం ద్వారా చేరుకునే అవకాశాలపై అన్వేషిస్తోందని తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్టుపై మాస్కో దృష్టి సారించిందన్నారు. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రణాళికను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఈ మార్గం రూపుదాల్చితే హోర్ముజ్ జలసంధి, బోస్ఫరస్ జలసంధి వంటి వ్యూహాత్మకంగా సున్నితమైన సముద్ర మార్గాలపై రష్యా ఆధారపడటం తగ్గుతుందన్నారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన బోస్ఫరస్, హర్మూజ్ జలసంధుల మార్గాలలో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రవాణా కారిడార్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రపంచ చమురు దాదాపు 25 శాతం, ఎల్ఎన్‌జీ రవాణాలో 20 శాతం హర్మూజ్ జలసంధి నుంచి రవాణ జరుగుతుంది. ఈ మార్గాల్లో ఉండే ఉద్రిక్తతలు తమ దేశంపై ప్రభావం చూపకూడదనేది వ్యూహంగా ఆలోచన చేసింది రష్యా.
రష్యా నుంచి తుర్క్‌మెనిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మీదుగా భారత్‌కు రైల్వే కారిడార్‌ను నిర్మించడం ఆచరణీయమైన మార్గంగా పేర్కొన్నారు రష్యా ఉప ప్రధాని. భారత్‌కు చేరువయ్యేందుకు ఏ మార్గమైనా పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రతిపాదన కేవలం ప్రాథమిక దశలో ఉందన్నారు. రైల్వే మార్గం ప్రయాణికుల టికెట్ ధరలు లేదా ప్రాజెక్టు ప్రారంభం తేదీలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
రైల్వే కారిడార్ రూపుదాల్చితే రష్యా-భారత్‌లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సముద్ర మార్గాలపై ఆధారపడకుండా, హిందూ మహా సముద్రం వైపు తమ సరుకులను రవాణా చేయడానికి రష్యాకు ఇదొక సువర్ణ అవకాశం. మధ్య-దక్షిణాసియాతో రష్యాకు కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. ఈ కారిడార్ ద్వారా భారత్-రష్యా-మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య-రవాణా సంబంధాలు మెరుగుపడనున్నాయి.
ప్రజల రాకపోకలు పెరిగి పర్యాటకం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన ఆచరణలోకి రావడం అంత సులభం కాదన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన. పలు దేశాల ద్వారా వెళ్లాల్సి ఉండటంతో మౌలిక సదుపాయాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయని అంటున్నారు. రవాణా-భద్రత-సరిహద్దుల సమన్వయం లాంటి అనేక క్లిష్టమైన అంశాలు దీంతో ముడిపడి ఉన్నాయి.
ALSO READ: అడవిలో కూలిన హెలికాప్టర్.. నలుగురి దుర్మరణం, ముగ్గురు టూరిస్టులు
ఈ సవాళ్లు గురించి తెలిసినప్పటికీ భారత్‌తో రైలు కనెక్ట్ కావాలన్న రష్యా ఆలోచన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో ఒకసారి ఇలాంటి ప్రతిపాదన వచ్చింది. ఏం జరిగిందో తెలీదుగానీ అనుకోకుండా వెనక్కిపోయింది. మరి ఈసారైనా అడుగులు పడతాయా? అన్నది వెయిట్ అండ్ సీ?