Kessler Syndrome : అంతర్జాతీయంగా వివిధ దేశాలు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉంటాయి. వాటిలో భూమిని పరిశీలించే, మ్యాపింగే చేసే శాటిలైన్ల దగ్గర నుంచి టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సహా అనేక ఇతర అవసరాలకు ఎన్నో శాటిలైట్లను ప్రయోగిస్తుంటారు. ఇవ్వన్నీ.. ఎక్కడ ఉంటాయి. అవి మనకు ఏ తీరుగా ఉపయోగపడతాయో మాత్రమే చాలా మందికి తెలుసు.. కానీ వాటి జీవితకాలం ఎంత, అవి పనిచేయడం పూర్తయిన తర్వాత ఎక్కడ ఉంటాయి. అనే విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించారు. లేదా.. అయితే రానున్న రోజుల్లో కచ్చితంగా మీరు ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ఈ అంశమే మనకు అతిపెద్ద సవాలుగా నిలువనుంది. దీనినే కెస్లర్ సిండ్రోమ్ గా వ్యవహరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ సిండ్రోమ్ గురించి మరింత తెలుసుకోండి.
అమెరికా, రష్యా, భారత్ సహా అనేక దేశాలు నిత్యం అంతరిక్షంలోకి వందల రాకెట్ల ప్రయోగాల్ని చేస్తుంటాయి. వాటి ద్వారా ఆయా దేశాల శాటిలైట్లను భూమి చుట్టూ ఉండే వివిధ కక్ష్యల్లోకి ప్రవేశపెడుతుంటాయి. అవి అక్కడి నుంచి భూమిపైన ఉంటే రిసీవర్లకు సమాచారాన్ని చేరవేస్తూ సేవలందిస్తుంటాయి. మరైతే.. ఇవి ఎంత కాలం పని చేస్తాయి అని ఎప్పుడైన ఆలోచించారు. సుదూర అంతరిక్ష ప్రయోగాలకు వినియోగించే శాటిలైట్ల జీవిత కాలం తక్కువగానే ఉంటుంది కానీ, భూ కక్ష్యలో తిరిగే శాటిలైట్ల జీవిత కాలం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే.. కొన్ని శాటిలైట్లు పది, పదిహేనేళ్లు పనిచేస్తుంటాయి. మరికొన్ని.. ఏడెనిమిది ఏళ్లకు వాటి పని ముగుస్తుంది. ఆ తర్వాత అవి ఏమవుతాయంటే.. ఏ కక్ష్యలో అయితే ప్రవేశపెట్టారో, అక్కడే నిరుపయోగంగా తిరుగుతుంటాయి.
ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న ప్రయోగాలతో అంతరిక్షం చెత్తకుప్పలా మారుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం.. మధ్య స్థాయి, పెద్ద సైజు వ్యర్థాలన్నీ కలిపి ఓ 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇదే సమయంలో చిన్న సైజులోని వ్యర్థాలు ఏకంగా 10 కోట్లుగా పైగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నింటికంటే.. అంతరిక్షంలో వీటితోనే ఎక్కువ ప్రమాదమని అంటున్నారు. భూకక్ష్యలో అత్యంత వేగంగా తిరుగుతూ ఉండే ఇవి.. శాటిలైట్లను బలంగా ఢీకొట్టి నష్టపరుస్తాయని అంటున్నారు. వీటిని గుర్తించడం కూడా కష్టమంట.. ప్రస్తుతానికి 10 కోట్ల వ్యర్థాలలో కేవలం 27,000 వ్యర్థాలనే గుర్తించడం ప్రమాదర తీవ్రతను భారీగా పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో నట్లు, బోల్టులు, గడ్డకట్టిన రాకెట్ ఇంధనం రేణువులు, రాకెట్ ఉపరితలంపై వాడే రంగుల పెచ్చులు ఉంటాయని అంటున్నారు. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం రోబోటిక్ హ్యండ్ కి రంధ్రం పడటానికి కారణం ఇవేనని భావిస్తున్నారు.
ఇప్పటికైతే.. భూ దిగువ కక్ష్యలో 14 వేలకు పైగా శాటిలైట్లు ఉన్నాయి. కాగా వీటిలో 3,500 పనిచేయనివిగా గుర్తించారు. ఇవి పని చేసే శాటిలైట్లను ఢీ కొట్టే ప్రమాదం ఉండడంతో ఆందోళన రేకెత్తుతున్నాయి. అదే జరిగితే.. ప్రపంచ వ్యాప్తంగా నేవిగేషన్, కమ్యూనికేషన్‌లకు తీవ్ర అంతరాయం తలెత్తే ప్రమాదం ఉంది. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి. దీంతో ఇవి పరస్పరం ఢీకొనే ముప్పు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. అదే జరిగితే.. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. అలాగే, మొబైల్ ఫోన్లు, టీవీలు నిరుపయోగంగా మారుతాయి.
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్ తొలగింపు
భూమి మీద నుంచి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (International Space Station) త్వరలోనే పూర్తిగా తొలగించనున్నారు. ఎన్నో అంతరిక్ష పరిశోధనలకు కీలకంగా ఉన్న ఈ ప్రాజెక్టు పని కాలం అయిపోవడంతో డిస్మెండిల్ చేయాలని నాసా నిర్ణయించింది. ఇందులో భాగంగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ఓ ప్రైవేట్ స్పేస్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. అపర కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX)తో 843 మిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే.. మన కరెన్సీలో ఏకంగా దాదాపు రూ.7000 కోట్లకు పైమాటే. ఎన్నో క్లిష్ట దశలను దాటుకుంటూ.. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇందుకోసం.. 2030 వరకు సమయం పట్టనుంది.