
Cigarette : ఆనందానికి సిగరెట్టు.. ఆలోచనలను గిలగొట్టు.. అని అనుకుంటూ సిగరెట్టు మీద సిగరెట్టును కాల్చేసే వాళ్లను చూసే ఉంటారు. ఇలా గుప్పుగుప్పుమంటూ ఊదేస్తూ చివరకు సిగరెట్టు పీకలను విసిరేసేవారికి కొదవేం లేదు. ఆ పీకలను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. బహుశా లండన్‌కు చెందిన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ భావన కూడా అదే కావొచ్చు. అయితే ఆ సంస్థ సభ్యులు చిరాకుపడకుండా.. పొగరాయుళ్లకు కనువిప్పు కలిగించాలని నిశ్చయించారు.
సిగరెట్టు పీకలను ఎడాపెడా విసిరేయొద్దనే సందేశాన్ని వారికి ఇవ్వాలని తలపోశారు. అనుకున్నదే తడవు.. ఇదిగో ఇలా పీకల దిబ్బను అందంగా తీర్చిదిద్దారు. అదీ లండన్ థేమ్స్ నది ఒడ్డున ఉన్న కింగ్‌స్టన్ టౌన్ ప్రధాన వీధిలో! ఇంతకీ ఈ బృహత్తర ప్రయత్నం చేసింది కీప్ బ్రిటన్ టైడీ అనే సంస్థ.
బ్రిటన్ ప్రధాన వీధుల్లో రోజూ 2.7 మిలియన్ల పీకలను విసిరేస్తుంటారని ఆ సంస్థ చెబుతోంది. ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలిపింది. అలా వీధుల నుంచి సేకరించిన సిగరెట్టు పీకలను ఏరి తెచ్చి.. ఇలా శిల్పంలా చేశారు. ఇంగ్లండ్ లో చెత్తలో చేరే వస్తువుల్లో 66% సిగరెట్లేనని అంచనా.
ప్రతి 8 సిగరెట్లలో 7 సిగరెట్లను వీధుల్లోనే వెలిగిస్తారని ఆ సంస్థ తెలిపింది. అయితే తాగేయగా మిగిలిన పీకలను సరిగ్గా డిస్పోజ్ చేయడం లేదని, వాటిని వీధుల్లోనే గిరాటేస్తున్నారని సంస్థ సభ్యులు వాపోయారు. ఇలా చేయకుండా స్మోకర్లను చైతన్యపరిచేందుకే తామీ వినూత్న ప్రయత్నం చేశామని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీధుల్లో విసిరేసే సిగరెట్ పీకలు 12 బిలియన్లకు పైనే ఉంటాయట.