
Horsley Hills : అక్కడి కొండలు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా కనువిందు చేస్తుంటాయి. ఆస్వాదించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఈ ‘హార్సిలీ హిల్స్’ ప్రత్యేకతలు. ఈ ప్రదేశం ఎక్కడో కాదండోయ్.. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఈ హిల్స్ సముద్ర మట్టానికి 1314 మీటర్ల ఎత్తులో ఉంటాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 29 కి.మీ దూరంలో ఉన్న ఈ అద్భుత ప్రదేశాన్ని ‘ఆంధ్రా ఊటీ’ అంటారు.
తూర్పు కనుమల్లో ఉన్న ఈ హార్సిలీ హిల్స్ సముద్ర మట్టానికి బాగా ఎత్తులో ఉండటం వల్ల.. వేసవి కాలంలో సైతం ఇక్కడ చల్లగా ఉంటుంది. అన్ని కాలాల్లో పర్యాటకానికి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది. ఈ హిల్స్ పైకి వెళ్లే కొండ దారి.. రకరకాల మొక్కలతో, వన్యజీవులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ హిల్స్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమాలు పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి.
హార్సిలీ హిల్స్ విహారానికి వచ్చే ప్రకృతి ప్రేమికుల కోసం.. ఇక్కడ నిర్వహించే ట్రెక్కింగ్, గాలిలో తాళ్ల వంతెనపై నడవటం వంటి ఎన్నో రకాల సాహస కృత్యాలు వినోదాన్ని పంచుతాయి. వీటితో పాటు దాదాపు 150 ఏళ్ల వయస్సు ఉన్న యూకలిప్టస్ చెట్టు ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రకృతి అందాలతో పాటు వినోదాన్ని కోరుకునేవారికి ఆంధ్రా ఊటీ.. హార్సిలీ హిల్స్ బెస్ట్ ఆప్షన్. మరెందుకు ఆలస్యం.. ఈ సుందర ప్రదేశాన్ని మీ మనసుకు నచ్చినవారితో చుట్టి రండి.