Shahzadi Khan: తమ కూతురిని కాపాడాలని నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు చేసిన వేడుకోలు ఫలించలేదు. దేశానికి దూరంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని జైలులో ఉన్న షహజాది ఖాన్‌కు చివరికి మరణశిక్ష విధించబడింది. ఈ క్రమంలో తమ కుమార్తెను కడసారి చూడాలని, ఆమె తల్లిదండ్రులు గత వారం ఢిల్లీ హైకోర్టులో విజ్ఞప్తి దాఖలు చేశారు. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ మార్చి 5న అంత్యక్రియలకు ఆమె తల్లిదండ్రులను దుబాయ్ పంపిస్తామని తెలిపింది.
ఈ పిటిషన్‌కు సమాధానం ఇస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢిల్లీ హైకోర్టుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహజాదీ ఖాన్ అనే మహిళను గత నెల ఫిబ్రవరి 15న ఉరితీసినట్లు తెలిపింది. ఈ క్రమంలో అధికారులు వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తారని, ఆమె అంత్యక్రియలు మార్చి 5న జరగనున్నాయని ASG చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన 33 ఏళ్ల షహజాది ఖాన్ డిసెంబర్ 2021లో ఉపాధి కోసం వీసాపై అబుదాబికి వెళ్లింది. మరుసటి సంవత్సరం ఆగస్టు 2022లో ఒక కుటుంబం ఇంట్లో నవజాత శిశువును చూసుకునే పనిలో చేరింది. అదే ఆమెకు ముప్పు వచ్చిందని చెప్పొచ్చు. ఆ క్రమంలోనే కొన్ని నెలల తర్వాత డిసెంబర్ 7, 2022న ఆ నవజాత శిశువుకు టీకాలు వేయించారు. కానీ అదే రోజున ఆ శిశువు అనుకోకుండా మరణించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఆమెపై హత్య కేసు నమోదు చేశారు.
Read Also: Ola Electric: షాకిచ్చిన ఓలా ఎలక్ట్రిక్.. నష్టాలొచ్చాయని సంచలన నిర్ణయం!
విచారణ చేపట్టిన కోర్టు జూలై 31, 2023న ఆమెకు మరణశిక్ష విధించింది. ఆ క్రమంలో సెప్టెంబర్ ప్రారంభంలో ఆమె తన తండ్రికి ఫోన్ చేసి సెప్టెంబర్ 20 తర్వాత తనను ఎప్పుడైనా ఉరితీయవచ్చని చెప్పిందని ఆమె తండ్రి అన్నారు. తాను నిర్దోషినని, ఏ తప్పు చేయలేదని వాపోయినట్లు వెల్లడించారు. ఆ చిన్నారి పేరెంట్స్ వినియోగించే మెడిసిన్స్ కారణంగానే అలా జరిగినట్లు చెప్పిందని ఆమె తండ్రి అన్నారు.
ఆ క్రమంలోనే తన కుమార్తెకు న్యాయం చేయాలని, ఆమెను కాపాడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు ఈ-మెయిల్ ద్వారా అభ్యర్థించినట్లు మహిళ తండ్రి షబ్బీర్ ఖాన్ తెలిపారు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ సంప్రదించినప్పటికీ 2024 ఫిబ్రవరి 28న అబుదాబీ అప్పీలేట్ కూడా ఈ కేసు విషయంలో ఆమె ఉరిశిక్షను సమర్దించింది. దీంతో ఆ మహిళ తల్లిదండ్రులు చేసిన పోరాటం ఫలించలేదు. కానీ ఆ మహిళ చివరి అంత్యక్రియల కోసం మాత్రం వారిని యూఏఈ పంపించేందుకు భారత రాయభార కార్యాలయం సాయం చేస్తుంది.
మాములుగా అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో శిక్షలను కఠినంగా అమలు చేస్తారని చెబుతుంటారు. ట్రాఫిక్ రూల్స్ నుంచి మొదలు పెడితే పిల్లల సంక్షేమం వరకు ప్రతిదీ కూడా పక్కాగా అమలు చేస్తారని అంటారు. దీంతో అక్కడ నేరాలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలో ఈ కేసు విషయంలో కూడా అలాగే జరిగిందా, లేక ఇంకైదేనా కుట్ర ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది.