Big Stories

Moscow Concert Attack : మాస్కోలో భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి

- Advertisement -

Moscow Concert Attack in Russia (International news in Telugu) : రష్యా రాజధాని మాస్కోలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రమూకలు క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 60 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ధృవీకరించింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్ లో.. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ అయిన ఫిక్ నిక్ నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. కాగా.. ఐసిస్ ఇది తాము చేసిన దాడేనని ప్రకటించింది. ఈ దాడిని అమెరికా, ఐక్యరాజ్యసమితి, ఈయూ ఖండించాయి. దాడికి సంబంధించిన కొన్నివీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

ఇటీవల కాలంలో రష్యాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇది. మ్యూజిక్ కాన్సెర్ట్ ముగియడంతో ప్రజలు అక్కడి నుంచి లేచి వెళ్లిపోతున్న క్రమంలో సాయుధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆటోమేటిక్ తుపాకీతో కాల్పులు జరిపి.. డజన్ల మందిని చంపారు. ఆపై కాన్సెర్ట్ హాల్ కు నిప్పంటించారు. గతవారమే రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగగా.. వరుసగా ఐదోసారి దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin). కొద్దిరోజులకే ఇలాంటి ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

మాస్కో పశ్చిమ అంచున ఉన్న క్రోకస్ సిటీ హాల్‌లో దుండగులు పేలుడు పదార్థాలు విసిరారని, దీంతో భారీ మంటలు చెలరేగాయని రష్యా వార్తా నివేదికలు తెలిపాయి. ఆ మంటల్లో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పలువురు వ్యక్తులు కచేరీ హాలులోకి ప్రవేశించి సందర్శకులపై కాల్పులు జరిపారని ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది.

Also Read : ఉక్రెయిన్ రాజధానిపై రష్యా మిస్సైల్ ఎటాక్స్..

రష్యా మీడియాతో పాటు.. అక్కడి టెలిగ్రామ్ ఛానెల్స్ పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో హాల్ నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఒకరు ఇద్దరు వ్యక్తులు రైఫిల్స్‌తో మాల్‌లో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరో నలుగురు.. ప్రాణభయంతో కేకలు పెట్టిన వారిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చివేసినట్లు చూపించారు. మాస్కో రీజియన్ గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్.. తాను ఘటన జరిగిన ప్రాంతానికి వెళుతున్నానని, సహాయక చర్యల కోసం టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపినట్లు తెలిపారు.

మరోవైపు.. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు రష్యా అధికారులు తెలిపారు. అయితే మాస్కో మేయర్.. ఈ ఘటన తర్వాత ఈ వారాంతంలో జరగాల్సిన అన్ని సామూహిక సమావేశాలను రద్దు చేశారు. మాస్కోలో జరిగిన ఘటనపై వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ శుక్రవారం మాట్లాడుతూ.. తాను ఇంకా అన్ని వివరాల గురించి మాట్లాడలేనని ఆ విజువల్స్ చూడటానికే భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. తల్లులు, తండ్రులు, సోదరులు, సోదరీమణులు, పిల్లలు.. తమవారికి ఏమైందోనన్న సమాచారం తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

రష్యాలోని చెచ్న్యా ప్రావిన్స్‌లో వేర్పాటువాదులతో పోరాడుతున్న సమయంలో 2000వ దశకం ప్రారంభంలో జరిగిన ఘోరమైన ఉగ్రదాడులతో రష్యా అల్లాడిపోయింది. అక్టోబర్ 2002లో.. చెచెన్ మిలిటెంట్లు మాస్కో థియేటర్ వద్ద దాదాపు 800 మందిని బందీలుగా పట్టుకున్నారు. రెండు రోజుల తరువాత, రష్యన్ ప్రత్యేక దళాలు భవనంపై దాడి చేశాయి. ఈ దాడిలో 129 మంది బందీలు, 41 మంది చెచెన్ లు మరణించారు. చెచెన్ లను లొంగదీసుకునేందుకు రష్యన్ దళాలు ఉపయోగించే మాదక వాయువు ప్రభావాల వల్ల అనేక మంది మరణించారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News