Big Stories

Saddam Hussein : సింహంలా బతికి.. ఎలుకలా చిక్కి..

Saddam Hussein

Saddam Hussein : సింహంలా బతికాడు.. చివరకు ఎలుకలా దొరికిపోయాడు.. సద్దాం హుస్సేన్ పట్టుబడినప్పుడు అమెరికా ఆర్మీ అధికారి చేసిన వ్యాఖ్య ఇది! అమెరికాను గడగడలాడించిన ఆ నియంత చివరి రోజుల్లో నిజంగానే కలుగులో ఎలుకలాగా జీవించాల్సి వచ్చింది. అమెరికా సైనికుల చేతికి సద్దాం చిక్కి రెండు దశాబ్దాలైంది.

- Advertisement -

2003లో అమెరికా, మిత్రదేశాల సైన్యం ఇరాక్‌పై దండయాత్ర చేసింది. అనంతరం సద్దాం పరారయ్యాడు. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిన అతని కోసం సైనికులు తీవ అన్వేషణ సాగించారు. అతి‌పెద్ద మానవ వేటగా ఇది చరిత్రపుటలకెక్కింది. లక్షన్నర మందికిపైగా సైనికులు సద్దాం కోసం గాలించారు. 8 నెలల పాటు అదే పనిలో ఉన్నారు.

- Advertisement -

చివరకు స్వస్థలం టిక్రీట్‌లో 13 డిసెంబర్ 2003లో దొరికిపోయాడు. 1979లో తొలిసారిగా ఇరాక్ పగ్గాలు సద్దాం చేతికి చిక్కాయి. అప్పటి నుంచి 2003లో సైన్యానికి చిక్కేంత వరకు అడపాదడపా అతని పాలన సాగింది. టిక్రీట్‌ సమీపంలోని ఎడ్వార్ పట్టణానికి చెందిన అలా నామిక్‌ వ్యవసాయక్షేత్రంలో చిన్న బంకర్‌లో సద్దాం తలదాచుకున్నట్టు సైనికులకు ఉప్పందింది.

సద్దాం కోసమే ప్రత్యేకంగా ఆ గొయ్యిని నామిక్ తవ్వడం విశేషం. చెట్ల పొదల మధ్యన 8 అడుగులే ఉన్న ఆ డెన్‌లో సద్దాం తలదాడుకోవడం విస్మయం కలిగించే అంశమే. సద్దాం చెమట వాసనతో నిండిపోయిందంటే అదెంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు. టిక్రీట్‌లో సద్దాం‌కు ఉన్న 20 రహస్యస్థావరాల్లో ఇదొకటి. ఓ మంచం, చిన్నపాటి వంటగదితో ఉన్న అవుట్‌హౌస్ బంకర్‌కు సమీపంలో ఉంది. బంకర్ ప్రవేశ మార్గం కూడా చాలా చిన్నది.

2000లో సద్దాం నుంచి ప్రమాదం పొంచి ఉందన్న విషయం అమెరికా గ్రహించింది. అతడిని సజీవంగా పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఇరాక్‌లోని 12 ఇళ్లపై దాడులు చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకుని.. అక్కడికి చేరేలోగానే తప్పించుకుంటూ అమెరికన్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ఆచూకీ గురించి తెలిసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 600 ఆపరేషన్లు చేపట్టారు. సద్దాం ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ 300 మందిని విచారించారు.

సద్దాం పట్టుబడినప్పుడు మాసిపోయిన గడ్డంతో, బెదురుచూపులతో ఉన్నాడు. ఇరాక్ ప్రత్యేక ట్రైబ్యునల్‌లో విచారణ అనంతరం 30 డిసెంబర్ 2006న ఉరితీశారు. అప్పటికి అతని వయసు 69. అమెరికా సైనికుల కళ్లుగప్పి 235 రోజుల పాటు సద్దాం‌కు ఆశ్రయం ఇచ్చినందుకు నామిక్, అతడి సోదరుడు ఖాయిస్ ఏడు నెలలకు పైగా బాగ్దాద్‌లోని అబూ గ్రేబ్ జైలులో ఉన్నారు. ఓ నియంతకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా నామిక్ జీవితాన్ని తెరకెక్కించారు. ‘హైడింగ్ సద్దాం హుస్సేన్’ పేరిట తీసిన ఆ డాక్యుమెంటరీ ఇటీవలే విడుదలైంది. ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి 12 సంవత్సరాలు పట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News