Donald Trump Govt: ఎట్టకేలకు అన్నట్లుగానే చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాజాగా ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో తయారై అమెరికాలో దిగుమతి చేసుకునే కార్లపై 25 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. విధించిన సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు బుధవారం వైట్‌హౌస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకాలు చేశారు.
ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికాలో తయారు చేయని వాహనాలపై వడ్డన మొదలు పెట్టేశారు అధ్యక్షుడు ట్రంప్. ఆటోమొబైల్ దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో తయారయ్యే వాటిపై వాహనాలపై ఎలాంటి సుంకం ఉండదన్నారు. ఆటో టారిఫ్‌ల వల్ల 100 బిలియన్ డాలర్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల అమెరికాలో తయారీ పరిశ్రమను బలోపేతం కానుంది.
అమెరికాలోకి వచ్చే ప్యాసింజర్ కార్లు, ట్రక్కులు, ఆటో విడిభాగాలపై భారీ సుంకాలు వడ్డించింది ట్రంప్ ప్రభుత్వం. వాటిలో సెడాన్లు, ఎస్యూవీలు, క్రాసోవర్లు, మినీ వ్యాన్లు, కార్గో వ్యాన్లు, తేలికపాటి ట్రక్కులతో సహా ప్రయాణీకుల వాహనాలు ఉన్నాయి.
ఏయే దేశాలపై ప్రభావం
అలాగే విడి భాగాల విషయానికొస్తే.. ఇంజిన్‌లు, ట్రాన్స్ మిషన్‌లు, పవర్ ట్రైన్ భాగాలు, ఎలక్ట్రికల్ కాంపోనెంట్‌లు వంటి కీలక భాగాలు ఉన్నాయి. ఆటో మొబైల్ సెక్టార్‌పై ట్రంప్ విధించిన టారిఫ్‌లు తన పదవీకాలంలో ఉంటాయన్నారు ట్రంప్. ట్రంప్ నిర్ణయం వల్ల కెనడా, మెక్సికో, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి.
ALSO READ: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 24 మంది మృతి
1962 నాటి వాణిజ్య విస్తరణ చట్టంలోని సెక్షన్ 232ను వెనక్కి తీసుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆటోమొబైల్స్, వాటి విడిభాగాల దిగుమతులు వల్ల అమెరికా జాతీయ భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అమెరికా ఆటోమొబైల్ సెక్టార్
ఆటోమొబైల్ సెక్టార్‌లో దాదాపు 10 లక్షల మంది అమెరికన్లు ఉపాధి పొందుతున్నారు. ఆటో విడిభాగాల తయారీ ఉద్యోగాలు దాదాపు ఐదున్నర లక్షల పైమాటే. అయితే 2000 ఏడాది నుంచి ఈ విభాగంలో దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు కోల్పోయామని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ట్రంప్ నిర్ణయంతో అమెరికా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వాటిలో హ్యుందాయ్ కంపెనీ ఒకటి. 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. లూసియానాలో కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీ కోసం 5.8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. దీనివల్ల దాదాపు 1,500 ఉద్యోగాలు రానున్నాయి.
అలాగే స్టెల్లాంటిస్ కంపెనీ యూఎస్ తయారీ నెట్‌వర్క్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇల్లినాయిస్ తయారీ ఫ్యాక్టరీని ఓపెన్ చేయనుంది. ఫోక్స్ వ్యాగన్ హై ఎండ్ ఆడి, పోర్షే వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని అమెరికాకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి.
హోండా అయితే సివిక్ హైబ్రిడ్ మోడల్‌ని ఇండియానాలో ఉత్పత్తి చేయనుంది. నిస్సాన్ అయితే తన ఉత్పత్తిని మెక్సికో నుంచి అమెరికాకు మార్చాలని భావిస్తోంది. రోల్స్ రాయిస్ కంపెనీ అమెరికన్ కార్మికులను నియమించుకోవడం ద్వారా ఉత్పత్తిని పెంచాలని ఆలోచన చేస్తోంది. ఇదే బాటలో వోల్వో కూడా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ప్రజలు స్వాగతిస్తున్నారు.