South Korea Wildfire Deaths| దక్షిణ కొరియాలో ప్రస్తుతం భీకరమైన కార్చిచ్చు రగులుతోంది. కార్చిచ్చు కారణంగా శతాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడనంత భయంకరంగా అగ్ని ప్రమాదాలు నమోదవుతున్నాయి. దేశంలోని దక్షిణ ప్రాంతం మొత్తం మంటల్లో కాలిపోతోంది. ఇళ్లు, పాఠశాలలు, కర్మాగారాలు, పూజా స్థలాలు అన్నీ కాలి బూడిద అయ్యాయి. ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోగా.. 27 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. శతాబ్దాల చరిత్ర కలిగిన రాజభవనాలు, వంతెనలు ఇక ఆనవాళ్లు లేకుండా అదృశ్యమయ్యాయి. దాదాపు 50 వేల ఎకరాల అడవి ప్రాంతం మంటలకు ఆహుతయ్యింది. ఇది దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత భయంకరమైన అగ్ని ప్రమాదంగా నమోదవుతోంది.
భారీ గాలులతో కార్చిచ్చు వేగంగా వ్యాప్తి
దక్షిణ కొరియాలో భారీ ఎత్తున వీచే ఈదురు గాలుల వల్ల కార్చిచ్చు అత్యంత వేగంగా విస్తరించింది. ఈ మంటల వల్ల 200కి పైగా ఇళ్లు, కర్మాగారాలు, ఒక పురాతన బౌద్ధ దేవాలయం కూడా కాలిపోయాయి. జాతీయ అగ్నిమాపక సంస్థ ఈ వివరాలను బుధవారం (మార్చి 26) ధృవీకరించింది.
పూర్తిగా కాలిపోయిన ఊయిసోంగ్ ప్రాంతం
ఊయిసోంగ్ ప్రాంతం మొత్తం మంటలకు గురై మాడిపోయింది. ఈ ప్రాంతం మొత్తం ఒక మండే అగ్ని గోళంగా మారింది. ఈ అగ్ని ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక హెలికాప్టర్ కూలిపోయి, ఒక పైలట్ మృతి చెందాడు. శాంచియోంగ్ ప్రాంతంలో వేగంగా వ్యాపించిన మంటల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గౌన్సాలో కూడా భారీ నష్టం
దక్షిణ కొరియాలోని మరొక ప్రధాన ప్రాంతమైన గౌన్సాలో కూడా కార్చిచ్చు భారీ నష్టాన్ని కలిగించింది. ఇక్కడ వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 7వ శతాబ్దంలో నిర్మించబడిన ఒక ప్రసిద్ధ బౌద్ధ దేవాలయం, దాని చుట్టూ ఉన్న నిర్మాణాలు పూర్తిగా నాశనమయ్యాయి. వీటిలో 1668లో నిర్మించిన ఒక ప్రసిద్ధ వాగుపై ఉన్న పెవిలియన్, 1904లో జోసెయోన్ రాజవంశం కాలపు భవనం కూడా ఉన్నాయి.
Also Read: భారత్ తరహాలో అమెరికా ఎన్నికలు.. ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్
అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం
ఈ అగ్ని ప్రమాదం వల్ల సౌత్ కొరియా చరిత్రలో ఎన్నడూ లేనంత భయంకరమైన నష్టం సంభవించింది. దీంతో ప్రభుత్వం దిగ్భ్రాంతికి గురై, సైనికులు, అత్యవసర బలగాలను త్వరగా ప్రభావిత ప్రాంతాలకు తరలించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. 130 హెలికాప్టర్లు, 5 వేల మంది అగ్నిమాపక సిబ్బంది, సైన్యం, ఎమర్జెన్సీ బృందాలు విపత్తు నివారణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. అయితే, రాత్రి సమయంలో బలమైన గాలులు వీచడం వల్ల మంటలు మరింత తీవ్రమవుతున్నాయి, ఇది రక్షణ కార్యక్రమాలకు అడ్డుపడుతోంది. దక్షిణ కొరియాకు ఈ అగ్ని ప్రమాదం వల్ల తీరని నష్టం కలిగిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్ డక్ ప్రకటించారు.
కార్చిచ్చుకు కారణాలు
ఈ కార్చిచ్చుకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియకపోయినా, మానవుల తప్పిదం వల్ల ఇది సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక సమాధి ప్రాంతంలో జరిగిన వెల్డింగ్ పనుల స్పార్క్‌ల వల్ల మంటలు ప్రారంభమయ్యాయని ఊహిస్తున్నారు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు
కొన్ని రోజుల క్రితమే అమెరికాలోని కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్‌లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వేలాది ఇళ్లు కాలిపోయాయి, లక్షల కోట్ల ఆస్తులు నాశనమయ్యాయి. ఆ దుర్ఘటనను ప్రజలు మరిచిపోకముందే, ఇప్పుడు దక్షిణ కొరియాలో ఈ భయంకరమైన కార్చిచ్చు ప్రారంభమైంది. ఊరు తల్లడిల్లుతోంది, ప్రతి ఇల్లు ఒక నిప్పుల కొలిమిగా మారింది.