Trump US Universities Funds| ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు.. అమెరికా యునివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఎంతో ఆశతో ఉంటారు. అక్కడ నాణ్యమైన విద్య లభిస్తుందనే నమ్మకం ఇందుకు ప్రధాన కారణం. సాంకేతిక పరిజ్ఞానం,నవీన ఆవిష్కరణలు, పరిశోధనలకు అవసరమైన పూర్తి సౌకర్యాలు, అత్యాధునిక వసతులతో అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అయితే, ఈ ఏడాది పరిస్థితిలో గణనీయమైన మార్పులు వచ్చాయని నిపుణులు తెలుపుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అమెరికా విశ్వవిద్యాలయాలు కష్టకాలంలోకి ప్రవేశించాయని చెబుతున్నారు. ఈ కారణంగా, ఉన్నత విద్య కోసం అమెరికా విశ్వవిద్యాలయాలను ఎంచుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోతలు విధించింది. అంతేకాకుండా, విద్యార్థులపై ఆంక్షలు కూడా పెంచారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం ఇంతకు ముందు ఉన్నట్లు ఇకపై సులభంగా ఉండదు. ముఖ్యంగా, విదేశీ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చదువుకోవడానికి సిద్ధపడితే, భారీ ఖర్చులు భరించాల్సి రావచ్చు.
పరిశోధనలకు నిధులు తగ్గించిన ట్రంప్ ప్రభుత్వం
అమెరికాలో ఉన్నత విద్య ప్రధానంగా ప్రభుత్వ మద్దతుపై ఆధారపడి ఉంది. ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే విశ్వవిద్యాలయాలు చాలావరకు నడుస్తున్నాయి. మెడిసిన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో పరిశోధనలు మరియు కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేస్తుంది. ఇలాంటి గ్రాంట్లలో ట్రంప్ ప్రభుత్వం భారీ కోతలు విధించింది. దీని వల్ల పరిశోధన కార్యక్రమాలు, శాస్త్రీయ ఆవిష్కరణలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. నిధుల కొరత వల్ల పరిశోధనలు పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. విదేశీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే పరిస్థితి కూడా ఇకపై ఉండదు. వారికి రీసెర్చ్ అసిస్టెంట్‌షిప్స్, స్కాలర్‌షిప్స్ అందించే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి.
Also Read: గాజా భూభాగాన్ని ఆక్రమించండి.. సైన్యానికి ఇజ్రాయెల్ ఆదేశాలు
ఒకవైపు వనరులు తగ్గుతుండగా.. మరోవైపు సౌకర్యాలు కూడా తగ్గుతున్నాయి. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఇంతకు ముందు స్వేచ్ఛాయుత వాతావరణం ఉండేది. విద్యార్థులు నిర్భయంగా రాజకీయ చర్చలు జరుపుతూ, తమకు నచ్చిన సంస్థలకు మద్దతు ప్రకటించేవారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో ఆందోళనలు మరియు నిరసనలకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇలాంటి కార్యక్రమాలపై కఠినమైన నియంత్రణలు విధించారు. ఉగ్రవాద లేదా తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్లు అనుమానం వస్తే, విద్యార్థులను విశ్వవిద్యాలయాల నుండి బహిష్కరిస్తున్నారు. విదేశీ విద్యార్థులను బలవంతంగా దేశం నుండి బయటకు పంపుతున్నారు. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు ఇప్పుడు భయంతో కూడిన వాతావరణంలో గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై అనేక రకాల ఆంక్షలు అమలులోకి వచ్చాయని వారు తెలుపుతున్నారు.
భారతీయ విద్యార్థులకు కేంద్రం సూచన
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచించింది. ఇటీవల ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేయబడింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, అమెరికాలోని భారత ఎంబసీ మరియు కౌన్సులేట్ కార్యాలయాలు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వీసాలు మరియు వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణాధికారంలో ఉన్నాయని, వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేశారు.
అవకాశంగా తీసుకున్న చైనా
అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితిని చైనా విశ్వవిద్యాలయాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. పరిశోధన మరియు సాంకేతిక రంగాలకు నిధుల కేటాయింపులు భారీగా పెంచబోతున్నట్లు చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇన్నోవేషన్‌లో అమెరికాను వెనక్కి నెట్టి, ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కెనడా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల విశ్వవిద్యాలయాలు కూడా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇతర దేశాల్లో అమెరికా కంటే మెరుగైన వసతులు, స్వేచ్ఛ, నిధులు.. అందుబాటులో ఉన్నప్పుడు.. ఆ దేశాలకు వెళ్లి చదువుకోవడంతో తప్పేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.