Trump Govt: స్వదేశంలో ఫారెన్ ఉద్యోగులను ఏదో విధంగా పంపేందుకు ప్లాన్ చేసింది ట్రంప్ సర్కార్. ఈ నేపథ్యంలో కొత్త ఇమిగ్రేషన్ పాలసీకి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అసలే వివిధ కంపెనీల్లో లే ఆఫ్స్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, ట్రంప్ సర్కార్ తీసుకురానున్న కొత్త పాలసీపై అక్కడి భారతీయుల్లో భయాలు నెలకున్నాయి. అసలు మేటరేంటి?
అమెరికాలో H-1B వీసాపై పని చేస్తున్నవారికి బిగ్ షాక్ ఇవ్వనుంది ట్రంప్ సర్కార్. ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో ఉండేందుకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని తొలగించేలా పావులు కదుపుతోంది. అమలైతే కొత్త ఉద్యోగం వెతుక్కునే అవకాశాలు తగ్గిపోతాయి. ఉద్యోగం కోల్పోయిన వెంటనే అమెరికాను విడాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం H-1B వీసాదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సమర్పించిన ఈ ప్రతిపాదన.. వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షలో ఉంది. దీనికి ఇంకా తుది రూపు ఇవ్వలేదని సమాచారం. ప్రతిపాదిత నియంత్రణకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
H-1B వీసాపై అమెరికాలో పని చేయడానికి చాలామంది ఉద్యోగులు వెళ్తుంటారు. ఆ కార్మికులకు అనుకోకుండా ఉద్యోగం కోల్పోయినప్పుడు మరొక ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజుల సమయం ఉండేది. 2017లో ఈ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. అర్హత గల కార్మికులు వారి ఉద్యోగం ముగిసిన తర్వాత వరుసగా 60 రోజుల వరకు, వారికి అనుమతించబడిన కాలం ముగిసేవరకు అమెరికాలో ఉండవచ్చు.
ఈ వ్యవధిలో ఉద్యోగులు.. మరో అర్హత గల ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి దేశంలో చట్టబద్ధంగా నివసించడానికి అవకాశం ఉంటుంది. ఈ నిబంధన వల్ల అమెరికాలో ఉన్న విదేశీ కార్మికులను నియమించుకోవడానికి యజమానులకు మరింత వెసులుబాటు కల్పిస్తుంది.
ALSO READ: భారత్‌కు అమెరికా బిగ్ షాక్.. రష్యా నుంచి చమురు కొంటే 100% ట్యాక్స్.. బిల్లుకు సెనేట్ ఆమోదం!
కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. 60 రోజుల గడువును ఉపయోగించుకోకుండానే ఉద్యోగులు అమెరికాను వీడే అవకాశం ఉంది. ఉద్యోగ ఆధారిత వలస హోదాపై ఆధారపడే విదేశీ నిపుణులకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రతిపాదిత మార్పు టెక్నాలజీ-హెల్త్‌కేర్-ఇంజనీరింగ్- ఇతర రంగాల్లో పనిచేసే H-1B ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.
ట్రంప్ సర్కార్ తీసుకురానున్న కొత్త ప్రతిపాదన భారతీయ నిపుణులపై తీవ్రమై ప్రభావం చూపనుంది. H-1B లబ్ధిదారులలో భారతీయల వాటా అధికంగా ఉంది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్-USCIS ప్రకారం.. 2024 లో ఆమోదించబడిన H-1B వీసాదారుల్లో సుమారు 71 శాతం భారత్‌కు చెందినవారే. అమెరికా సెన్సస్ డేటా ఆధారంగా.. 52 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు అక్కడ నివాసం ఉంటున్నారు.