US Offers Reward: ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని అందించిన వారికి 20 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 165 కోట్లు) రివార్డుతో పాటు తమ దేశంలో పునరావాసం (పౌరసత్వం) కల్పిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. గత ఎనిమిది నెలలకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఒకవైపు దౌత్యపరమైన చర్చలు తీవ్రస్థాయిలో జరుగుతుండగానే.. అమెరికా ఈ ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
యుఎస్ సెంట్రల్ కమాండ్ శుక్రవారం తన అధికారిక ప్రకటనలో రివార్డ్ వివరాలను వెల్లడించింది. స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’ ప్రోగ్రామ్ ద్వారా ఇరాన్ అణు కేంద్రాలు, అణు పరికరాలు, శాస్త్రవేత్తలు, వాటి రవాణాకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపింది. 1984లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ అమెరికన్ పౌరుల భద్రత కోసం కీలక సమాచారం ఇచ్చేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తోంది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణకు ఇరాన్ సహకరించకపోవడం వల్ల అక్కడ జరుగుతున్న అణు ఉత్పత్తిపై స్పష్టత కొరవడిందని అమెరికా పేర్కొంది.
Rewards for Justice is offering a reward of up to $20 million and possible relocation for information about Iran’s nuclear program, including its facilities, equipment, and associated personnel, such as those in the scientific community, or the movement of any of the above.
Submit a tip: https://t.co/A8uRQJSosj
— U.S. Central Command (@CENTCOM) November 7, 2026
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అందుకే వారు ఒప్పందం చేసుకునేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తాము సమర్థవంతంగా దెబ్బతీశామని ఒకవేళ తాము దాడి చేయకపోయి ఉంటే ఇజ్రాయెల్ ఉనికిలోనే ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. అయితే సెంట్రల్ ఇరాన్‌లోని ‘పిక్యాక్స్ మౌంటెన్’ వంటి కొన్ని కీలక ప్రాంతాలపై ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ఓవైపు ఇరాన్ తో ఒప్పందానికి ప్రయత్నిస్తూనే మరోవైపు ఆ దేశంలోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై శుక్రవారం పరిమిత స్థాయిలో వైమానిక దాడులను అమెరికా జరిపింది. హార్ముజ్ జలసంధిలోని క్వేష్మ్ ద్వీపంలో బాంబు పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇటీవలి అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన మొదటి సైనిక చర్య ఇదే కావడం గమనార్హం.
Also Read: కేబీఆర్ తరహాలో లక్డీకాపూల్‌లోనూ వన్-వే రూట్.. సీపీ సజ్జనార్ కీలక నిర్ణయం.. ఎటు నుంచి వెళ్లాలంటే?
మరోవైపు ఇరాన్ – అమెరికా – ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఖతార్ సమర్పించిన పలు దౌత్య ప్రతిపాదనలను ఇరాన్ ప్రస్తుతం సమీక్షిస్తున్నట్లు సమాచారం. అయితే అమెరికా సైనిక దాడులను విరమించి సీజ్ ఫైర్ కు అంగీకరించే వరకు అణు అంశాలపై చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది.
Also Read: ఎఫ్‌డీఏ సంచలన నిర్ణయం.. బ్లింకిట్, జెప్టో సహా.. 105 సంస్థల ఫుడ్ లైసెన్సులు రద్దు!