Trump Tariffs Fear Foregin Countries | ప్రపంచదేశాలు తాను విధించే సుంకాలకు భయపడి కాళ్లబేరానికి వస్తున్నాయని.. సుంకాలు తగ్గించేందుకు తనను యాచిస్తున్నాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అహంకార పూరతింగా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక సుంకాలు తగ్గింపు చర్చలు చేస్తున్న దేశాల గురించి మరింత అసభ్య కరంగా మాట్లాడారు.
సుంకాల తగ్గింపు ఈ విషయంలో తనను సంప్రదించాలని కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తూ చెప్పారు.
నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసనల్ కమిటీ సమావేశంలో బుధవారం, ట్రంప్ మాట్లాడుతూ.. “ఏ విధంగా చూసినా కాంగ్రెస్ కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఈ దేశాలు నాకే ఫోన్ చేస్తున్నాయి. సుంకాల విషయంలో సాయం కోసం బతిమాలుతున్నాయి. దయచేసి మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామని దిగజారుతున్నాయి. ప్రాధేయపడుతున్నాయి. నేను ఏం చెబితే అది చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. నా డాష్‌ని (అసభ్యపదజాలం) ముద్దుపెట్టుకోమంటే. అవి కూడా చేస్తాయి. ” అని వ్యాఖ్యానించారు.
అమెరికా కాంగ్రెస్ కంటే నేనే బెటర్
సుంకాలపై ప్రపంచ దేశాలతో ఒప్పందాలు కుదర్చడానికి కాంగ్రెస్‌ని అనుమతించాలని రిపబ్లికన్ పార్టీలోని కొందరు తిరుగుబాటు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగివుంటే.. చైనాపై ఈ రోజు 104 శాతం సుంకాలు విధించగలిగే వారమా?.. పైగా చైనా చాలా సంతోషంగా ఉండేది. బదులుగా అమెరికా సుంకాలు చెల్లించవలసి వచ్చేది. మన దేశాన్ని అమ్మివేయవలసి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో కాంగ్రెస్ సమర్థవంతంగా పనిచేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి – నా కంటే బెటర్ గా మీరెవరూ బేరసారాలు చేయలేరు” అని ట్రంప్ తన వ్యాఖ్యలలో స్పష్టం చేశారు.
Also Read: రోజుకు 1000 డాలర్లు ఫైన్, ఆస్తులు స్వాధీనం చేస్తాం.. విద్యార్థులకు వీసా రద్దు చేస్తున్న అమెరికా
అమెరికాకు కంపెనీలు వెంటనే తిరిగి రావాలి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధిస్తూ అంతర్జాతీయ వాణిజ్యంలో తీవ్ర అలజడి రేపారు. ఈ కారణంగా ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. దీంతో బడా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితిలో ట్రంప్ వారికి ఓ ఆఫర్ ఇచ్చారు. అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మళ్లీ తరలించాలని పిలుపునిచ్చారు. అమెరికాలోనే ఉత్పత్తులు తయారు చేస్తే.. టారిఫ్ సమస్యలు ఉండవని, వేగంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.
“మీరు మీ కార్యకలాపాలను అమెరికాకు తరలించడానికి ఇది అత్యుత్తమ సమయం. యాపిల్ సహా అనేక కంపెనీలు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించాయి. సున్నా టారిఫ్‌లు, తక్షణ విద్యుత్/ఇంధన అనుమతులు, పర్యావరణ అనుమతుల్లో ఎటువంటి ఆలస్యం ఉండదు. ఎదురు చూడకండి, ఇప్పుడే ప్రారంభించండి” అని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య సుంకాలు విధించడం మంచిదని జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డిమోన్ ఇంతకుముందు చెప్పిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. తన ప్రభుత్వ నేతృత్వంలో ప్రతిదీ సక్రమంగా సాగుతోందని, అమెరికా ఇంతకు ముందు కంటే ఉత్తమంగా పనిచేస్తోందన్నారు.