West Bengal Crime News: వెస్ట్ బెంగాల్ లో మహిళలపై, అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గతంలో ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘోరం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఘటన మరువకముందే మరో మెడికల్ కాలేజీలో ఓ విద్యార్ధినిపై దుండగులు అత్యాచారం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. దుర్గాపూర్‌లోని శాభాపూర్ ప్రాంతంలోని.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్ధినిపై.. కొందరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో బాధితురాలు తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లి తిరిగి క్యాంపస్‌కి చేరే సమయంలో ఈ ఘటన జరిగింది. క్యాంపస్ గేట్ వద్ద ఓ గ్యాంగ్ బాధితురాలిని బలవంతంగా.. ఆసుపత్రి వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.
అత్యాచారం అనంతరం బాధితురాలి ముబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్న మృగాళ్లు.. మూడువేల రూపాయలు ఇస్తేనే సెల్ ఇస్తాం అంటూ దుర్మార్గమైన డిమాండ్ చేశారు. బాధితురాలు భయంతో అక్కడినుండి తప్పించుకుని.. తన స్నేహితుడికి సమాచారం ఇచ్చింది. దీంతో అతను కాలేజీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు స్నేహితుడు, కాలేజీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన గ్యాంగ్‌ను పట్టుకునేందుకు.. సీసీకెమరా పుటేజ్‌ను సేకరిస్తున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ సంఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై మెడికల్ విద్యార్ది సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్ వద్ద భారీగా నిరసనలు చేపట్టారు.
మరోవైపు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు అత్యాచారాల అడ్డాగా మారింది అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఏడాది క్రితం జరిగిన ఇలాంటి ఘటనను గుర్తు చేసుకుంటూ.. ప్రభుత్వం వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
గత ఏడాది ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో కూడా.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దుర్గాపూర్ ఘటన మరోసారి అదే భయాన్ని ప్రజల్లో కలిగిస్తోంది.
Also Read: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్‌లో వెళ్లే రైళ్లన్నీ రద్దు, ముందుగా చెక్ చేసుకోండి
విద్యార్థులు, మహిళా సంఘాలు ఇలాంటి ఘటనలపై.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల భద్రత కోసం హాస్టల్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు, అదనపు సెక్యూరిటీ గార్డులను నియమించాలంటూ ఆందోళన చేపట్టారు. ఇలాంటి ఘటనలు మరళా పునరావృతం కాకుండా.. చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.