Gulf Of Mexico Greenland Trump| అగ్రరాజ్యంలో అధికారాన్ని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త నిర్ణయాలతో పాలనలో జోరు పెంచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico) పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా (Gulf of America)గా మార్చినట్లు ట్రంప్ కార్యవర్గం ప్రకటించింది. అంతేకాక, అలస్కాలోని ఎత్తైన శిఖరం డెనాలిని (Peak Denali) మౌంట్ మెకిన్లేగా (Mount McKinley) మళ్లీ పిలవాలని నిర్ణయించింది.
పేర్లు మార్పుపై ప్రకటన
“అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పిలవడం జరుగుతుంది. అలాగే, ఉత్తర అమెరికాలోని ఎత్తైన అలస్కన్ శిఖరం పీక్ డెనాలిని మౌంట్ మెకిన్లేగా పునర్నామకరణం చేశాం. ఈ నిర్ణయాలు అగ్రరాజ్య సంపదను కాపాడటమే కాకుండా, గల్ఫ్ ఆఫ్ అమెరికా చరిత్రను భవిష్యత్ తరాలు గౌరవిస్తాయి” అని ట్రంప్ ప్రభుత్వ విభాగం ప్రకటించింది.
అయితే, ట్రంప్ జియోలాజికల్ సర్వే ఈ పేర్ల మార్పులు చేసినప్పటికీ అంతర్జాతీయంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరును అంగీకరించడం కష్టం అని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Also Read: 10 శాతం బ్రిటన్ ధనవంతుల వద్ద భారత్ నుంచి దోచుకున్న సంపద.. ఆక్స్‌ఫామ్ రిపోర్ట్
గల్ఫ్ ఆఫ్ మెక్సికో వివాదం
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చాలని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా అధికారంలోకి రాకముందే ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా పదవి చేపట్టిన తరువాత ఇటీవలే గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసి దీన్ని అధికారికం చేశారు. ట్రంప్ నిర్ణయం పట్ల మెక్సికో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ కొన్ని రోజుల క్రితం ఈ అంశంపై మీడియా సమావేశం నిర్వహించి 1607లో రూపొందించిన మ్యాప్‌లను చూపించారు. ఆ మ్యాప్ లో ఆ ప్రాంతం చరిత్రలో ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ అనే పేరే ఉపయోగించారన్నారు.
అలస్కా పీక్ డెనాలి చరిత్ర
అలస్కాలోని శిఖరాన్ని 1975లో అక్కడి రాష్ట్ర అభ్యర్థన మేరకు డెనాలిగా (కోయుకాన్ భాషలో ‘ఎత్తు’ అని అర్థం) పిలవడం ప్రారంభించారు. అయితే, అంతకుముందు ఈ శిఖరాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు విలియం మెకిన్లీ గౌరవార్థం మౌంట్ మెకిన్లేగా పిలిచేవారు.
గ్రీన్‌లాండ్ కొనుగోలు వివాదం
ట్రంప్ చూపు గల్ఫ్ ఆఫ్ మెక్సికో వరకే ఆగిపోలేదు. అంతకు ఒక అడుగు ముందుకేసి గ్రీన్‌లాండ్ ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలన్న తన ప్రయత్నాన్ని కూడా ట్రంప్ పునరుద్ఘాటించారు. కానీ, డెన్మార్క్ ప్రధానమంత్రి మెటె ఫ్రెడెరిక్సన్ (Mette Frederiksen) ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ వ్యవహారంపై ఇటీవలే ట్రంప్, ఫ్రెడెరిక్సన్‌ల మధ్య ఘాటైన సంభాషణ జరిగిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో డెన్మార్క్ ప్రధానిని ట్రంప్ బెదిరించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.
గ్రీన్‌లాండ్ ఖనిజ సంపద
గ్రీన్‌లాండ్‌లో రాగి, లిథియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ముడి పదార్థాలు బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రీన్ లాండ్ అమెరికా ఆధీనంలో ఉంటే తమ దేశానికి ఇతర దేశాల నుంచి ముప్పు ఉండదని పైకి ట్రంప్ వాదిస్తున్నా.. ఆర్థిక లాభాల కోసమే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని జియోపాలిటిక్స్ నిపుణులు విమర్శలు చేస్తున్నారు.