Trump India Foreign Aid | భారతదేశం వద్ద పెద్ద మొత్తంలోనే నిధులున్నాయని మరి అలా దేశానికి అమెరికా ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృథా వ్యయాన్ని నియంత్రించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన డోజె (DOGE) విభాగం తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. భారతదేశంలో ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించాలని నిర్ణయించిన 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఈ విభాగం ఇటీవలే రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం వివాదాలను రేకెత్తించింది. భారతదేశానికి ఎందుకు డబ్బు ఇవ్వాలని ప్రశ్నించిన ట్రంప్, “అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బు ఇతర దేశాలకు ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించారు.
ఫ్లోరిడాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ విషయంపై మాట్లాడుతూ, “భారతదేశానికి మేం ఎందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలి? వారి దగ్గర ఇప్పటికే చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వారు విధించే సుంకాల రేట్లు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల గౌరవం ఉంది. అయితే.. వారి (భారత్) ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మేమెందుకు 21 మిలియన్ డాలర్లు ఇవ్వాలా? మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉందో మనం ముందు చూడాలి కదా!” అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: కాశ్మీర్ అంశంపై మరోసారి పాకిస్తాన్ లొల్లి.. భారతభూభాగంలో ప్రజాభిప్రాయ సేకరణకు డిమాండ్
ఇతర దేశాలకు అందించే నిధులను తగ్గించే ప్రక్రియలో డోజ్ విభాగం ఫిబ్రవరి 16న కొత్త జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే బంగ్లాదేశ్, నేపాల్‌కు కేటాయించిన ఫండ్‌ను కూడా రద్దు చేసింది. ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటనకు వెళ్లారు. ఆయన పర్యటన ముగిసిన వెంటనే ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజె విభాగం భారత్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాలకు అందించే ఆర్థిక సాయాన్ని కూడా నిలిపివేస్తూ.. అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు ఈ నిర్ణయాలు చాలా అవసరమని పేర్కొంది. అయితే.. డోజె విభాగం తీసుకున్నఈ నిర్ణయం భారతదేశంలో రాజకీయ వివాదానికి దారితీసింది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ ఈ నిర్ణయంపై తీవ్ర ప్రతిఘటన వ్యక్తం చేశారు. “ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్లు ఇవ్వడం అంటే భారత ఎన్నికల ప్రక్రియలో ఆ దేశం జోక్యం చేసుకోవడమే. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? అధికార పార్టీ మాత్రం కాదు” అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భారతీయ వ్యవస్థల్లో విదేశీ సంస్థలు వ్యవస్థీకృతంగా జోక్యం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విదేశీ బంధాలు బయటపడుతున్నాయని ఆయన ఆరోపణలు చేశారు. అయితే, కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను తిరస్కరించారు.
ఈ వివాదం భారతదేశంలో రాజకీయ వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇది భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కూడా ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.