Kashmir Plebiscite Pakistan| కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తన పట్టుదలను మళ్లీ ప్రదర్శించింది. కాశ్మీరీ ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకునేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానాలను భారత్ అమలు చేయాలని పాకిస్తాన్ వాదిస్తోంది. కాశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ (Plebiscite) నిర్వహించాలని కోరుతూ పాకిస్తాన్ పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. కాశ్మీర్ ప్రజలు ఏ దేశంలో కలిసి ఉండాలో తెలుసుకోవడం కోసం ఓటింగ్ నిర్వహించడమే ఈ ప్లెబిసైట్ ఉద్దేశం. అయితే, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఇలాంటి తీర్మానాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కానీ ఈ తాజా తీర్మానం వెనుక కారణం ఏమిటో స్పష్టంగా కాలేదు.
ఈ తీర్మానాన్ని కాశ్మీర్ వ్యవహారాల మంత్రి ఇంజనీర్ అమీర్ ముకమ్ నేషనల్ అసెంబ్లీ(పాకిస్తాన్ పార్లమెంట్) లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాశ్మీరీ ప్రజల హక్కుల కోసం పాకిస్తాన్ రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతు అందిస్తుందని అన్నారు. మానవ హక్కుల పరిస్థితులను మెరుగుపరచాలని, నిర్బంధించబడిన నేతలను విడుదల చేయాలని మరియు అణచివేత ధోరణిని విడనాడాలని భారత్‌ను కోరుతూ ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
మరోవైపు భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ తన స్పెషల్ స్టేటస్‌ని కోల్పోయింది. తర్వాత ఈ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది. అప్పటి నుంచి భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దిగజారాయి. మరోవైపు.. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఎప్పటికీ అంతర్భాగమేనని ఇండియా పలుమార్లు స్పష్టం చేసింది.
Also Read: భారత్ ఎన్నికల్లో అమెరికా జోక్యం.. ఆధారాలు బయటపెట్టిన మస్క్!
భారత్ పాకిస్తాన్ మధ్య కాశ్మీ వివాదం 1947 స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉంది. భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ఏర్పాడ్డాక.. ఇరు దేశాల మధ్యలో ఉన్న కాశ్మీర్ పై పాకిస్తాన్ కన్నేసింది. ఈ క్రమంలో పాక్ సైన్యం కాశ్మీర్ పై దాడి చేయగా.. అప్పటి జమ్ము కాశ్మీర్ మహారాజు భారత్ తో కొన్ని ప్రత్యేక షరుతులతో తన రాజ్యాన్ని అప్పగించేశారు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్, భారత్ ల మధ్య కాశ్మీర్ పరిష్కారం లేని సమస్యగానే మిగిలిపోయింది. కాశ్మీర్ లోని కొంత భూభాగం ఇప్పటికీ పాకిస్తాన్ ఆధీనంలో ఉంది.
అఫ్ఘాన్ సరిహద్దులో 30 మంది ఉగ్రవాదులను హతమార్చిన పాక్ సైన్యం
పాకిస్తాన్ సైన్యం అఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతంలో పలువురు ఉగ్రవాదులను హతమార్చింది. ఈ సైనిక చర్య వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగింది. నిఘావర్గాలు అందించిన సమాచారం ప్రకారం, భద్రతా దళాలు ఈ ఆపరేషన్‌ను చేపట్టి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ వివరాలను పాకిస్తాన్ సైన్యం మీడియాకు తెలిపింది.
ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందిన తర్వాత దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలోని సరోఘా ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 30 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఐఎస్‌పీఆర్ తెలిపింది. ఈ సైనిక చర్య విజయవంతమైన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ సాయుధ దళాలను ప్రశంసించారు.
ఈ సంఘటనకు ముందు, పాకిస్తాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఆ దాడిలో నలుగురు పాకిస్తాన్ సైనికులు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. 2025 జనవరి నుంచి పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులు పెరిగాయని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది 2024 డిసెంబర్‌తో పోలిస్తే 42 శాతం ఎక్కువ. జనవరిలో ఉగ్రవాద నిరోధక చర్యలలో భాగంగా భద్రతా దళాలు 185 మంది ఉగ్రవాదులను హతమార్చాయని ఒక నివేదిక పేర్కొంది.