Sandeep Reddy Vanga: ఒక సెన్సేషనల్ హీరో అవ్వాలన్నా, దర్శకులు అవ్వాలన్నా ఒక్కరోజులో జరిగే విషయం కాదు.. ఎన్నో ఏళ్లు కష్టపడితే తప్పా ఆ పొజిషన్‌లోకి రారు. కానీ వారు పడిన ఆ కష్టం గురించి తెలియని ప్రేక్షకులు.. వారికి ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ వచ్చేసిందని కామెంట్స్ చేస్తుంటారు. అలా ఎన్నో ఏళ్లు కష్టపడి ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన మొదటి అడుగునే గట్టిగా వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’తో సందీప్‌కు వచ్చిన సక్సెస్ గురించే ప్రేక్షకులకు తెలుసు.. కానీ దాని వెనుక తను పడిన కష్టం గురించి చాలామంది తెలియదు. తాజాగా ఒక స్టార్ రైటర్ సందీప్ రెడ్డి వంగా సాడ్ స్టోరీ గురించి బయటపెట్టాడు.
ఎన్నో ప్రయత్నాలు
టాలీవుడ్‌లోని స్టార్ రైటర్స్‌లో కోన వెంకట్ కూడా ఒకరు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గురించి ప్రస్తావన వచ్చింది. అయితే సందీప్ పడిన కష్టం చాలామందికి తెలియదని అసలు కథ వివరించారు కోన వెంకట్. ‘అర్జున్ రెడ్డి’ని వెండితెరపైకి తీసుకురావడానికి సందీప్ రెడ్డి వంగా చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు. అప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ అంటే ఒక బోల్డ్ సినిమా. ఈ మూవీలో నటించడానికి హీరోలు ఒప్పుకోవడమే పెద్ద విషయంగా మారింది. అందుకే ఏ హీరో అయినా కథను మార్చమని చెప్పమని ఉన్నది ఉన్నట్టుగా నటిస్తే చాలు అని సందీప్ ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
Also Read: రూ. వందల కోట్ల ఆస్తి పై స్పందించిన సీనియర్ నటి..!
వారిద్దరూ అంతే
మూడేళ్ల పాటు ఒక హీరో ఆఫీసులో పనిచేయడానికి సందీప్ రెడ్డి వంగా ఒప్పుకున్నాడని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. మెల్లగా ఆ హీరోను ఒప్పించి తనతోనే ‘అర్జున్ రెడ్డి’ని తెరకెక్కించవచ్చని సందీప్ నమ్మకాలు పెట్టుకున్నాడట. తనకు మూడు పూటలా భోజనం దొరకడం, తన డ్రీమ్ ప్రాజెక్ట్ నిజమవ్వడం అనే ఆలోచనలోనే ఈ మూడేళ్లు గడిపేశాడట. కానీ మూడేళ్ల తన దగ్గర పనిచేయించుకున్న తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమా చేయడం తనకు ఇష్టం లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేశాడట ఆ హీరో. అలాగే మరొక హీరో దగ్గరకు వెళ్లి తన చుట్టూ రెండేళ్ల పాటు తిరిగాడట. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది.
విజయ్‌కు రాసిపెట్టుంది
అలా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాను ఎలాగైనా తెరకెక్కించాలనే లక్ష్యంతో ఇద్దరు హీరోల చుట్టూ తిరిగి అయిదేళ్లు వేస్ట్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఫైనల్‌గా ఈ కథను యంగ్ హీరో శర్వానంద్ ఓకే చేశాడు. కానీ నిర్మాతల ఒత్తిడి వల్ల కథలో మార్పులు చేయమంటూ సందీప్‌కు సూచించాడు. అది నచ్చని సందీప్.. ఆ కథను వినిపించి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను హీరోగా ఓకే చేశాడు. అలా ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్‌నే మలుపు తిప్పింది. సందీప్ రెడ్డి వంగాను తిప్పించుకున్న హీరోలు ఎవరు అనే విషయాన్ని కోన వెంకట్ రివీల్ చేయకపోవడంతో వారెవరో అని ప్రేక్షకులు గెస్ చేయడం మొదలుపెట్టారు.