Ukraine War Starlink Trump| ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధాన్ని ముగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. యుద్ధం ముగిస్తేనే అమెరికా లాభం ఉండడంతో ట్రంప్ ఆ విధంగా పావులు కదుపుతున్నారు. ఉక్రెయిన్‌లోని అరుదైన భూగర్భ ఖనిజాలపై దృష్టి ట్రంప్ పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఖనిజాలు అమెరికాకు ఇచ్చేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒప్పందం కుదర్చుకోవడానికి ఓసారి నిరాకరించినట్లు సమాచారం. కానీ ట్రంప్ అంత ఈజీగా వదిలే రకం కాదు. అందుకే అమెరికా నుంచి జెలెన్‌స్కీకి హెచ్చరికలు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
రష్యా దాడి మొదలైన దగ్గరి నుంచి ఉక్రెయిన్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ నిరంతరాయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది. ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ఉక్రెయిన్ బలగాలకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటీవల ఉక్రెయిన్‌లో యూఎస్ దౌత్యవేత్త, జెలెన్‌స్కీ మధ్య జరిగిన సమావేశంలో ఈ అంశం గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఖనిజాలకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోకుంటే.. స్టార్ లింక్ సేవలు నిలిపివేస్తామని అమెరికా దౌత్యవేత్తలు బెదిరించినట్లు సమాచారం. ‘‘స్టార్‌లింక్‌పై ఉక్రెయిన్ నడుస్తోంది. అది దూరమైతే జెలెన్‌స్కీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో కమ్యూనికేషన్ల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇది ఆసుపత్రులు, బ్యాంకింగ్ వంటి అత్యవసర సేవలకు అడ్డంకిగా మారింది. దీనికి పరిష్కారంగా బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ అక్కడ స్టార్ లింక్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. అంటే తక్కువ ఎత్తులో ఉండే ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవల్ని పొందేలా ఏర్పాట్లు చేసింది.
Also Read: చైనా తవ్విన ఈ బావి లోతు 11 కి.మీ – ఎందుకు తవ్వారో తెలుసా?
ఈ స్టార్‌లింక్ సేవల్ని కేవలం అత్యవసర సేవల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలన్నది కంపెనీ నియమం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని సైనిక అవసరాలకు వినియోగించుకోవడానికి నిబంధనలు అంగీకరించవు. కానీ, ఉక్రెయిన్ సేనలు స్టార్‌లింక్ నెట్‌వర్క్‌ను రష్యాపై దాడులకు ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ సంస్థ ఈ విషయంపై ఉక్రెయిన్ తో విభేదిస్తోంది కూడా. ఈ నేపథ్యంలో స్టార్ లింక్ పైనే ఉక్రెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ ఒక్కసారిగా ఉక్రెయిన్ లో స్టార్ లింక్ సేవలు నిలిపివేస్తే.. అలాంటి సందర్బంగా రష్యా సైన్యం యుద్ధంలో విజృంభిస్తుంది. అలా జరగక కుండా ఉండాలంటే యుద్ధంలో ఆపేందుకు జెలెన్‌స్కీ ఒప్పుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా ఉక్రెయిన్ భూగర్భ ఖనిజాలు అమెరికాకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో జెలెన్‌స్కీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది.
ఉక్రెయిన్‌లో ఉన్న అరుదైన భూగర్భ ఖనిజాలు వెలికితీసేందుకు గాను ఆ దేశంతో ట్రంప్ 500 బిలియన్ డాలర్ల మేరకు డీల్‌ను ప్రతిపాదించినట్లు బ్రిటన్‌కు చెందిన ఓ వార్తాపత్రిక పేర్కొంది. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలతోపాటు చమురు, గ్యాస్, పోర్టులు, మౌలిక సదుపాయాలు సహా ఆ దేశంలోని సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. ఉక్రెయిన్ నుంచి ట్రంప్ కోరుతున్న మొత్తం ఖనిజాల విలువ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువని సదరు బ్రిటన్ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ ఒప్పందం కుదిరితే.. ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల నిబంధనలను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్ నియంత్రణ సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఏవిధంగా చూసినా, దీనివల్ల అమెరికాకే ఎక్కువ లాభం చేకూరే అవకాశం ఉండడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు తెలిసింది. ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్‌కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అంటే జెలెన్‌స్కీ మెడలు వంచే ప్రక్రియ జరుగుతున్నట్లు అర్థమవుతోంది.