అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రెండుసార్లు డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ఆయన గెలిచిన తర్వాత మాత్రం ఇలాంటి దుస్సాహసానికి ఎవరూ ప్రయత్నించలేదు. అయితే కాలక్రమంలో ట్రంప్ కి శత్రువులు పుట్టుకొచ్చారు. అలాంటి ఒక భయంకరమైన శత్రువు ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ. ఖమేనీని మట్టుబెట్టడం తనకు చాలా ఈజీ అంటూ ఆ మధ్య ట్రంప్ నేరుగానే హెచ్చరించారు. ఆ తర్వాత ఇరాన్ పై అమెరికా దాడి చేసింది కూడా. అయితే ఖమేనీ మాత్రం వారికి దొరకలేదు. ఇప్పుడు ఖమేనీవైపు నుంచి ట్రంప్ కి హెచ్చరికలు మొదలయ్యాయి. ఆ వార్నింగ్ లు కూడా సినిమా స్టైల్లో ఉన్నాయి.
ఫ్లోరిడా నివాసం నుంచి ట్రంప్ బయటకు రావొచ్చు..
అక్కడ మార్-ఎ-లాగోలో ఆయన సన్ బాత్ కోసం ఆరుబయట పడుకొని ఉండొచ్చు..
అలాంటి సమయంలో ఒక బుల్లి డ్రోన్ వచ్చి ఆయన బొజ్జని ఢీకొట్టవచ్చు..
అలా ఢీకొట్టి ఆయన్ని చంపేయవచ్చు..
ఇదీ క్లుప్తంగా ఆ వార్నింగ్ సారాంశం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సలహాదారు మొహ్మద్ జావద్ లారిజాని ఈ హెచ్చరికలు జారీ చేశారు. సన్ బాత్ చేసే టప్పుడు ఆయన్ని లేపేస్తామంటూ పరోక్షంగా హెచ్చరించారు జావద్. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ.. అదే సమయంలో బదులు తీర్చుకోడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు జావద్.
క్రౌడ్ ఫండింగ్..
ట్రంప్ ని హత్య చేసేందుకు క్రౌడ్ ఫండింగ్ చేయడం ఇక్కడ మరో విశేషం. బ్లడ్ పాక్ట్ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టింది ఇరాన్. ఇరాన్ ఎవరినైతే శత్రువులుగా భావిస్తుందో, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎవరైతే అమర్యాదగా సంబోధిస్తారో.. వారిపై ప్రతీకారం తీర్చుకోడానికి అవసరమైన నిధుల్ని ఈ ప్లాట్ ఫామ్ ద్వారా సేకరిస్తారు. జులై 8 నాటికి దాదాపు 40 మిలియన్ డాలర్లను సేకరించినట్టు తెలుస్తోంది. మొత్తం 100 మిలియన్ డాలర్ల సేకరణను వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్రంప్ తోపాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి కూడా ఇలాంటి శిక్ష విధించాలని ఇరాన్ భావిస్తోంది.
ట్రంప్ రియాక్షన్ ఏంటంటే..?
ఇక ఈ హత్యాయత్నం హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. ఆ హెచ్చరికలను తాను ముప్పుగానే భావిస్తున్నానని చెప్పారు. అయితే అవి నిజమో కాదో తెలియదని అన్నారు. సన్ బాత్ పై మాత్రం ట్రంప్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. తనకు గుర్తున్నంత వరకు 7వ ఏట తాను సన్ బాత్ కోసం బయట విశ్రాంతి తీసుకున్నట్టు చెప్పారు ట్రంప్. అది తనకు పెద్దగా ఇష్టం ఉండదని అన్నారు. అమెరికా అధ్యక్షుడిని చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం, దానికోసం క్రౌడ్ ఫండింగ్ చేయడం సంచలనంగా మారింది. అయితే ఇరాన్-అమెరికా మధ్య ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం నుంచి ఇలాంటి వార్నింగ్ రావడాన్ని సాధారణంగానే పరిగణిస్తున్నారు. ఖమేనీని హతమార్చడం తనకు చాలా సులభం అని ట్రంప్ గతంలో హెచ్చరించారు. దానికి ప్రతిగా ఇప్పుడు ఖమేనీ సలహాదారు ట్రంప్ కి హెచ్చరికలు జారీ చేశారు.