Donald Trump: భారత్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు దూరమయ్యామంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదక ట్రూత్ లో పోస్ట్ చేశారు. భారత్, రష్యా దేశాలు చైనాకు దగ్గరైనట్టు తెలుస్తోందని చెప్పారు. కుట్రబుద్ధి ఉన్న చైనాకు రెండు దేశాలు దగ్గరయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ తో పాటు రష్యాను కూడా కోల్పోయామని వ్యాఖ్యానించారు. భారత్, చైనా, రష్యా దేశాల మైత్రి చాలా కాలం పాటు కొనసాగొచ్చని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. అయితే.. ట్రంప్ పోస్టుపై స్పందించేందకు భారత్ విదేశాంగ శాఖ నిరాకరించింది.
అయితే.. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఈ మూడు దేశాలకు సుసంపన్న భవిష్యత్తు ఉండాలని ట్రంప్ ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల గురించి ఆలోచింప జేస్తున్నాయి.
ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆయన భారత్ వస్తువులపై విధించిన 50 శాతం సుంకాలు, రష్యా నుంచి చమురు దిగుమతులపై విమర్శలు ఈ ఆవేదనకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ.. ప్రపంచ చమురు ధరలను స్థిరీకరణలో సహకరిస్తున్నప్పటికీ.. ట్రంప్ దీనిని అమెరికాకు నష్టంగా చూపారు. అమెరికా నుంచి తక్కువ దిగుమతులు, భారత్‌పై అధిక సుంకాలను ట్రంప్ విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు భారత్-అమెరికా మధ్య మరింత వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పెద్ద వాణిజ్య ఒప్పందం గురించి సానుకూలంగా మాట్లాడినప్పటికీ, ఇటీవలి సంఘటనలు సంబంధాల్లో ఒడిదొడుకులను సూచిస్తున్నాయి. భారత్, రష్యా, చైనా నాయకులు SCO సదస్సులో ఏకతాటిపై కనిపించడం.. ట్రంప్ విధానాలకు ప్రతిస్పందనగా ఉండవచ్చని అమెరికాలో కొందరు వాదిస్తున్నారు.
భారత విదేశాంగ శాఖ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టీకరించింది. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్య భాగస్వామ్యం కొనసాగుతుందని, సవాళ్లు ఎదురైనప్పటికీ, బలమైన సంబంధాలను కొనసాగించాలని భారత్ కోరుకుంటున్నట్లు తెలిపింది. ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయ, ఆర్థిక వేదికలపై చర్చను రేకెత్తించాయి, ఇది భవిష్యత్తులో ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపవచ్చు.
ALSO READ: PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?