Ukraine: ఏడాదిన్నరగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతోంది. ఉక్రెయిన్ లో పలు నగరాలను మాస్కో సైన్యం ధ్వంసం చేస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారీ రష్యాకు కీవ్ ఝలక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక.. మృతుల సంఖ్య, ఇరు వైపుల నష్టం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ రెండు దేశాల ప్రతినిధులు అంతర్జాతీయ వేదికపై గొడవకు దిగారు. రష్యా ప్రతినిధి చెంపను ఉక్రెయిన్ ప్రతినిధి చెల్లుమనించాడు.
ఈ వ్యవహారం అంతా టర్కీ రాజధాని అంకారాలో చోటు చేసుకుంది. అంకారాలో బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ సమావేశం జరుగుతోంది. ఈ వేదికగా ఉక్రెయిన్ ఎంపీ తన దేశ జెండాను ప్రదర్శించారు. అయితే.. కవ్వింపు చర్యలకు దిగిన రష్యా ప్రతినిధి.. ఆ జెండాను లాక్కొన్నారు. దీంతో.. ఆగ్రహానికి గురైన ఉక్రెయిన్ ఎంపీ.. రష్యా వ్యక్తిపై వేగంగా దూసుకెళ్లి, దాడి చేశారు. తరువాత చెంప చెల్లుమనించారు. సడెన్ గా జరిగిన ఈ ఘటనతో అక్కడివారంతా అవాక్కాయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గడిచిన పదిరోజులుగా ఇరుదేశాల మధ్య యుద్ధం మరింత ఉదృతంగా సాగుతోంది. ఉక్రెయిన్ లోని పలు నగరాలపై మాస్కో సైన్యం మిసైళ్లతో విరుచుకుపడుతోంది. అటు.. పుతిన్ పై హత్యయత్నం జరిగిందని రష్యా ఆరోపణలు చేస్తోంది. దీనికి ప్రతిగా జెలెన్‌స్కీని అంతం చేస్తామని రష్యా రక్షణ అధికారులు ప్రకటించారు. ఇలాంటి ఉద్రక్త పరిస్థితుల మధ్య.. రష్యా ప్రతినిధికి జరిగిన అవమానం యుద్ధానికి మరింత ఆజ్యం పోసినట్టైంది.