Ukraine-Russia war : అనుకున్నట్లుగానే ఉక్రెయిన్ – రష్యా యుద్ధం శృతిమించుతోంది. జెలెన్ స్కీ కోరుతున్నట్లుగా దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి బైడెన్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో.. రష్యాపైకి ఆధునిక ఆయుధాలను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో.. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
అమెరికా తయారు చేసిన ATACM దీర్ఘశ్రేణి క్షిపణుల్ని రష్యా పైకి ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలోని లక్షిత ప్రాంతాలే లక్ష్యంగా అమెరికా తయారీ ఆయుధాలు వినియోగించింది. ఉక్రెయిన్ సేనలు ఆరు దీర్ఘశ్రేణి ATACM క్షిపణుల్ని తెల్లవారుజామున 3.25 గంటలకు ప్రయోగించాయి. వీటిని రష్యన్ దళాలు విజయవంతంగా అడ్డగించినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. అయితే.. బ్రయాన్స్క్ లోని ఓ సైనిక శిబిరంపై ఈ క్షిపణి శకలాలు పడి అగ్ని ప్రమాదం జరిగినట్లు రష్యా ప్రకటించింది. అయితే.. అలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగలేదని వెల్లడించింది. క్షిపణి పూర్తిస్థాయిలో ట్రాక్ చేసినట్లు తెలిపిన రష్యా అధికారులు.. దాని శకలాల్ని సైతం సేకరించిన అమెరికా తయారీ క్షిపణిగా నిర్ధరించారు.
రష్యాలోని సుదీర్ఘ లక్ష్యాల్ని నాశనం చేసేందుకు అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్ చాన్నాళ్ల నుంచి చూస్తోంది. కానీ.. ఆమెరికా సహా నాటో దేశాలు అందుకు అంగీకరించడం లేదు. జెలెన్ స్కీ మాత్రం.. ఉక్రెయిన్ సైన్యం దీర్ఘ శ్రేణి క్షిపణుల్ని ప్రయోగించేందుకు అనుమతించాలంటూ కోరుతూనే ఉన్నారు. ఈ విజ్ఞప్తుల్ని ఇన్నాళ్లూ పక్కన పెట్టిన అగ్రరాజ్యం అమెరికా.. ఇటీవల ఉత్తర కొరియా సేనలు రష్యాలో మోహరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ కారణంగానే.. దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి పచ్చ జెండా ఉపింది. ఈ దాడులతో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో గేమ్ ఛేంజర్ అవుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు.
ఇటీవలే అణు క్షిపణుల ప్రయోగాలకు స్వేచ్ఛనిచ్చేలా అణు విధానానికి క్రెమ్లిన్ విధానపరమైన మార్పులు చేసింది. దాని ప్రకారం.. రష్యాకు నష్టం కలిగించే, తమ సరిహద్దుల్ని ఉల్లంఘించే.. ఎలాంటి చర్యలు చేపట్టినా, ఏదైనా తీవ్ర స్థాయి వైమానిక, క్షిపణి ప్రయోగాలు జరిగినా.. రష్యా అణు దాడులు చేసేందుకు అనుమతిస్తూ.. ఈ సవరణలు చేశారు. అలానే.. అణు బాంబులున్న ఏదైనా దేశం సాయంలో మరేదైనా దేశం తమపై దాడికి ప్రయత్నిస్తే.. తాము ఆ రెండు దేశాలు కలిసి చేస్తున్న యుద్దంగానే పరిగణిస్తామని రష్యా తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా అణు దాడికి దిగవచ్చంటూ.. తాజా సవరణలు తెలుపుతున్నాయి. దాంతో.. ప్రస్తుత దాడుల్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తే.. అణు దాడులకు సైతం వెనుకాడకపోవచ్చని అనుమానిస్తున్నారు.