US – Ukraine agreement : ఉక్రెయిన్ నుంచి అరుదైన ఖనిజాలు రాబట్టాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంతం నెగ్గినట్లే కనిపిస్తోంది. తీవ్ర యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న మిత్ర దేశమైన ఉక్రెయిన్ ను.. ఖనిజాలు ఇస్తే సైనిక సాయం, లేదంటే లేదు అంటూ సందిగ్ధావస్థలో పడేశారు ట్రంప్. ఈ విషయమై చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్.. ఎట్టకేలకు ట్రంప్ బేరాలకు తలొగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత అవసరాల మేరకు.. ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లుగా అంతర్జాతీయ మీడియా ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయమై త్వరలోనే జెలెన్స్కీ అమెరికా పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో.. ఈ పర్యటనపై అనేక ఊహాగానాలు, విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్రెయిన్ కు యుద్ధంలో సాయం చేసిన సొమ్ములకు సరిపడా ఆదేశంలోని ఖనిజాలపై హక్కులు కావాలన్న ట్రంప్ డిమాండ్ కు అంగీకరం తెలిపేందుకు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఒప్పందంలో అమెరికా ఆశించినట్లుగా 500 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఒప్పందానికి.. కొద్దిపాటి సవరణలు చేసి 350 బిలియన్ డాలర్ల మేరకు ఖనిజాల మార్పిడి చేసేందుకు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఉక్రెయిన అంగీకారం తెలిపినట్లు అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే.. ఉక్రెయిన్ దేశ ప్రయోజనాలు, దాని ఆంకాంక్షలకు భిన్నంగా ఉన్న ప్రతీ పదాన్ని తొలగించిన తర్వాతే.. ఒప్పందంలోని నిబంధనలను అంగీకరించినట్లుగా తెలుపుతున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఉక్రెయిన్ భద్రతకు, శాంతిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతానికి అయితే.. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియనప్పటికీ.. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై ఆగ్రహానికి కారణం అవుతుంది. అమెరికా ఇప్పటికే కీవ్‌కు అందించిన సహాయానికి బదులుగా ఉక్రెయిన్ లోని అరుదైన ఖనిజాలలో 500 బిలియన్ డాలర్ల వాటాను ఆశిస్తోంది. ఈ విషయమై ఇరు దేశాధినేతల మధ్య తీవ్ర మాటలు యుద్ధం కొనసాగింది. ఈ డిమాండ్ ను ఇప్పటికే తిరస్కరించిన జెలెన్స్కీ.. ఎలాంటి ఒప్పందానికి అంగీకారం తెలిపారో చూడాలంటున్నారు అధికారులు.
ఇదే విషయమై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. జెలెన్స్కీ శుక్రవారం వస్తున్నారని తెలిసింది. కచ్చితంగా.. అతను అంగీకరిస్తే నాకు ఓకే అంటూ వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ తనతో కలిసి ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటున్నాడని.. అది చాలా పెద్ద విషయమని తాను అర్థం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఖనిజ ఒప్పందం వల్ల ఉక్రెయిన్‌కు ఏం లాభం కలుగుతుందని ట్రంప్ ను మీడియా ప్రశ్నించింది. దానికి బదులుగా.. 350 బిలియన్ డాలర్లు, ఇంకా అనేక యుద్ధ పరికరాలు, సైనిక పరికరాలు, పోరాడే హక్కు లభిస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఉక్రెయిన్ భద్రతకు అమెరికా ఎన్నాళ్లు సహాయం చేస్తుందనే విషయమై స్పష్టత లేదు. ప్రస్తుత యుద్ధాన్ని ట్రంప్ ముగించినా, భవిష్యత్త్ లో ఉక్రెయిన్ పై మరోసారి దాడికి దిగితే.. ఎవరు రక్షిస్తారనేది కీలకాంశమైంది.
Also Read : EU Support Kyiv : ఉక్రెయిన్ లో యూరోప్ దేశాధినేతలు – ఒక్కసారిగా మిస్సైల్ సైరన్లు అలర్ట్