అమెరికాలో అక్రమంగా నివశిస్తున్న వలసదారుల్ని తరిమేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి లాస్ ఏంజిలస్ నగరం కొరకరాని కొయ్యలా మారింది. అక్రమ వలసదారులు ఏకంగా భద్రతాదళాలపైనే తిరగబడ్డారు. ఈ క్రమంలో అసలు అక్కడ ఏం జరిగింది..? ఏం జరుగుతోంది..? ఏం జరగబోతోంది.. అనేది సింపుల్ గా 10 పాయింట్లలో తెలుసుకుందాం.
1. వలసలపై అణచివేతకు వ్యతిరేకంగా దక్షిణ కాలిఫోర్నియాలో ప్రముఖ పట్టణమైన లాస్ ఏంజిలస్ లో నిరసనలు జరుగుతున్నాయి. నిరసనల మూడో రోజు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జాతీయ భద్రతా దళాలను మోహరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం వేలాది మంది ప్రదర్శనకారులు వీధుల్లోకి వచ్చి రచ్చ చేశారు.
2. నిరసన కారుల్ని చెదరగొట్టేందుకు, అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేసేందుకు లాస్ ఏంజిలస్ నగరంలో సుమారు 300 ఫెడరల్ ఆర్మీ యూనిట్స్ ని మోహరించారు. అయితే స్థానిక ప్రభుత్వ అధినేత గవర్నర్ అనుమతి లేకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్స్ ట్రంప్ నేషనల్ గార్డ్ లను పంపించారు.
3. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల అణచివేత చర్యలను ఖండిస్తూ మెక్సికన్ జెండాలు ఎగురవేశారు నిరసనకారులు. వారంతా నగరం చుట్టూ అనేక ప్రాంతాల్లో గుమిగూడారు.
4. మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ వద్ద ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు 101 ఫ్రీవేను అడ్డుకున్నారు. అరక్కడ ఉన్న కార్లకు నిప్పు పెట్టారు. పోలీసుల చర్యల్ని వారు తప్పుబట్టారు. షేమ్-షేమ్ అంటూ నినాదాలు చేశారు. వీరిని చెదరగొట్టేందుకు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లు పేల్చారు.
5. గతంలో ఎప్పుడూ ఇలా స్థానిక ప్రభుత్వాలని కాదని.. నేషనల్ గార్డ్స్ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేదు. 1963 నుంచి 69 మధ్య అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన లిండన్ బి. జాన్సన్ ఇలాగే రక్షణ దళాలను పంపించి సంచలనం సృష్టించారు. అప్పట్లో అలబామాలో పౌర హక్కుల మార్చ్‌ను రక్షించడానికి ఆయన దళాలను పంపించారు.
6. లాస్ ఏంజిలస్ ప్రాంతంలో వారం రోజులుగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారి సంఖ్య 100 దాటింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూనియన్ నాయకుడితో సహా అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
7. అయితే నేషనల్ గార్డ్ ల ఈ మోహరింపు చట్టవిరుద్ధమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ట్రంప్ సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని న్యూసమ్ ఆరోపించారు. నేషనల్ గార్డ్స్ ని పంపించడం నియంత చర్యలు అని అభివరఅమించారు.
8. తాజాగా ట్రంప్ ప్రదర్శనకారులపై మండిపడ్డారు. “హింసాత్మక, తిరుగుబాటుదారుల గుంపులు” అవి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లర్లను అదుపులోకి తేవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ అధికారులను ఆదేశించారు.
9. ఇక మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్.. ట్రంప్ వ్యవహారంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇమ్మిగ్రేషన్ దాడులు, నేషనల్ గార్డ్స్ మోహరింపుని ఆమె తప్పుబట్టారు. ఇమ్మిగ్రేషన్ సమస్యకు ఇది సరైన పరిష్కారం కాదని అన్నారామె. ఈ సమస్యను దాడులు, హింసతో పరిష్కరించలేరన్నారు.
10. ఈ వారంలో US ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE).. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్థాయిలో వలసదారుల అరెస్టు చేసింది. ఒకరోజులో జరిగిన అరెస్టులలో ఇదే అత్యథికం. ఒకేరోజు 2,200 మందికి పైగా వలసగారులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది. సగటున రోజుకి 3వేలమందిని అరెస్ట్ చేయాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు. లాస్ ఏంజెలస్ లో మాస్కులు ధరించడంపై కూడా ఆంక్షలు విధించారు. ఆందోళనల్లో మాస్క్‌ల వినియోగాన్ని ట్రంప్ నిషేధించారు.