US Iran: అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అమెరికా, ఇరాన్ సంబంధాలు మరోసారి తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరగనున్నాయా లేదా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఖతార్ రాజధాని దోహా వేదికగా ఇరాన్‌తో కీలక భేటీ జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరాబరంగా చెపుతుండగా, అలాంటి ప్రసక్తే లేదంటూ ఇరాన్ విదేశాంగ శాఖ ఘాటుగా తిరస్కరించింది. ఇరు దేశాల అధినాయకత్వాల నుంచి వస్తున్న ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలు, ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి.
ట్రంప్ క్లైమ్.. ‘ట్రూత్ సోషల్’ వేదికగా సంచలన ప్రకటన
వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించే దిశగా దోహాలో బుధవారం ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోందని స్పష్టం చేశారు. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారడాన్ని తాము ఎంతమాత్రం అంగీకరించబోమని, ఇందుకు ఇరాన్ సైతం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. దీనికంటే ముందే, ఇరానే స్వయంగా తమతో చర్చల కోసం అభ్యర్థించిందని, రేపు దోహాలో భేటీ ఉంటుందని ట్రంప్ తన అధికారిక ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించారు. అమెరికా వ్యూహాత్మక ఒత్తిడికి ఇరాన్ లొంగివచ్చిందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో అమెరికాతో ఏ స్థాయిలోనూ ఎలాంటి చర్చలు ప్రణాళికలో లేవని ఆయన తేల్చి చెప్పారు. తమ సాంకేతిక బృందం ఈ వారం ఖతార్ వెళ్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, దానికి అమెరికా అధికారుల రాకతో ఎటువంటి సంబంధం లేదని, దీనిని ద్వైపాక్షిక చర్చలుగా భావించలేమని స్పష్టం చేశారు. అయితే, ఒక సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. మంగళవారం చర్చలు జరిగే అవకాశం ఉందని భిన్నమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఈ చర్చలు గతంలో స్విట్జర్లాండ్‌లో జరిగిన సాంకేతిక చర్చల్లా కాకుండా, అంతర్జాతీయంగా కీలకమైన ఇంధన రవాణా మార్గమైన ‘హర్మూజ్ జలసంధి’ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడంపైనే కేంద్రీకృతమవుతాయని సదరు అధికారి వెల్లడించారు.
తెరవెనుక రాయబారం.. రంగంలోకి కుష్నర్ బృందం
ఈ గందరగోళం మధ్యే, తెరవెనుక దౌత్యం వేగంగా కదులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమెరికా-ఇరాన్ సాంకేతిక బృందాలు బుధవారం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తులతో విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సున్నితమైన చర్చల కోసం అమెరికా తరఫున అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో పాటు, ట్రంప్ నమ్మకస్థుడు, అల్లుడు జారెడ్ కుష్నర్ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో మధ్యప్రాచ్య శాంతి ఒప్పందాలలో (అబ్రహం అకార్డ్స్) కీలక పాత్ర పోషించిన కుష్నర్ నాయకత్వంలోని బృందం, ఇరాన్‌తో పరోక్షంగానైనా ఒక అవగాహనకు రావాలని భావిస్తోంది. అయితే ఇరుపక్షాలు నేరుగా కూర్చునేందుకు ఇరాన్ అహం అడ్డొస్తుండటంతో మధ్యవర్తుల పాత్ర కీలకంగా మారింది.
గల్ఫ్‌లో క్షిపణుల మోత
గత నాలుగు నెలలుగా సాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం మునిగే స్థితికి చేరింది. గత వారాంతంలో ఇరు దేశాల మధ్య జరిగిన క్షిపణులు, డ్రోన్ల దాడులు ఈ ఉద్రిక్తతలను మరింత పెంచాయి. హర్మూజ్ ప్రాంతంలో రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయగా, ప్రతిచర్యగా ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా మిలిటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరపడానికి ఈ కాల్పుల విరమణ ఒక సదవకాశంగా భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరస్పర దాడులు అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో దోహా చర్చలపై నెలకొన్న స్పష్టత లేని వాతావరణం గల్ఫ్ రీజియన్‌లో శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తోంది.
Also Read: జర్మనీలో కాల్పుల కలకలం.. ఒకే ఒక్క గొడవ, ఆరు ప్రాణాలు గాల్లోకి!