US Layoffs Diplomats| అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ ఫుల్ జోష్ తో పరిపాలన సాగిస్తున్నారు. తన మన భేదం లేకుండా అందరినీ ఫైర్ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో 1,300 మంది దౌత్యవేత్తలు, సివిల్ సర్వెంట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
తొలగించబడిన వారిలో 1,107 మంది సివిల్ సర్వెంట్లు, 246 మంది ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లు ఉన్నారు. వీరంతా అమెరికాలోని దేశీయ పనుల్లో పనిచేస్తున్నవారు. ఈ తొలగింపులు ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం ప్రారంభించిన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగం. ఈ విషయాన్ని శుక్రవారం స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని ఒక సీనియర్ అధికారి ప్రకటించారు.
తొలగింపు నోటీసులు పొందిన ఫారిన్ సర్వీస్ ఆఫీసర్లు వెంటనే 120 రోజుల సెలవుపై పంపించబడతారు. ఇది ఒక రకంగా సస్పెషన్ లాంటింది. ఈ గడువు పూర్తి అయిన తరువాత ఆ అధికారులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. సివిల్ సర్వెంట్లకు 60 రోజుల అదనంగా గడువు ఉంటుంది. ఒక ఇంటర్నల్ నోటీసు ప్రకారం.. “డిపార్ట్‌మెంట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. మేము దేశీయ కార్యకలాపాలను సులభతరం చేస్తున్నాము. దౌత్య ప్రాధాన్యతలపై దృష్టి పెట్టడానికి, నిరుపయోగంగా ఉన్న లేదా తక్కువగా వినియోగంలో ఉండే కార్యాలయాలను తగ్గిస్తున్నాము. కేంద్రీకరణ లేదా బాధ్యతలను ఏకీకృతం చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుతున్నాము”. అని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది
ఈ నిర్ణయం ఎందుకు?
ఈ ఉద్యోగ తొలగింపులను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో, వారి రిపబ్లికన్ సహచరులు సమర్థిస్తున్నారు. ఈ తొలగింపులు.. డిపార్ట్‌మెంట్‌ను మరింత సమర్థవంతంగా, చురుకైనదిగా పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు. అయితే, ప్రస్తుత.. మాజీ దౌత్యవేత్తలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ తొలగింపులు అమెరికా అంతర్జాతీయ ప్రభావాన్ని తగ్గిస్తాయని. ప్రపంచదేశాలతో ఇప్పటికే ఉన్న, కొత్తగా ఉద్భవించే బెదిరింపులను ఎదుర్కోవడంలో దేశాన్ని బలహీనపరుస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
సుప్రీం కోర్టు ఆమోదం
ఈ తొలగింపులకు ఇటీవల అమెరికా సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ట్రంప్ ప్రభుత్వానికి 19 ఫెడరల్ ఏజెన్సీలలో విస్తృతమైన ఉద్యోగ తొలగింపులు పునర్వ్యవస్థీకరణలను అమలు చేయడానికి మార్గం సుగమం చేసింది. ఈ ప్రణాళికలు వేలాది ఉద్యోగాలను తొలగించడానికి, ఫెడరల్ బ్యూరోక్రసీని పునర్నిర్మించడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే, ఈ తొలగింపుల చట్టబద్ధతను సవాలు చేస్తూ కొన్ని కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.
ఇతర ఫెడరల్ ఉద్యోగ తొలగింపులు
స్టేట్ డిపార్ట్‌మెంట్‌తో పాటు, ట్రంప్ ప్రభుత్వం ఇతర ఫెడరల్ ఏజెన్సీలలో కూడా ఉద్యోగ తొలగింపులను అమలు చేస్తోంది. ఇప్పటివరకు, వేలాది ఫెడరల్ ఉద్యోగులు తొలగించబడ్డారు. ఉద్యోగలు స్వయంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు వారికి గడువు ఇవ్వబడుతుంది. ఈ విధానాన్నే అమెరికా ప్రభుత్వం వాయిదా రాజీనామాలుగా పేర్కొంది. అధికారిక సంఖ్యలు లేనప్పటికీ.. సుమారు 75,000 మంది ఫెడరల్ ఉద్యోగులు వాయిదా రాజీనామాలు తీసుకున్నారని, చాలా మంది ప్రొబేషనరీ ఉద్యోగులు ఇప్పటికే తొలగించబడ్డారని అమెరికా మీడియా నివేదించింది.
ఈ ఉద్యోగ తొలగింపులు స్టేట్ డిపార్ట్‌మెంట్ యొక్క పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇంకా స్పష్టం కాలేదు.