US Strikes Iran Fail| ఇరాన్ పై గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ చేసిన వైమానిక దాడుల వల్ల పెద్ధగా నష్టం కలుగలేదని సమాచారం. జూన్ 22, 2025న ఇరాన్ లోని మూడు అణు స్థావరాలపై అమెరికా భారీ బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసింది. కానీ ఈ దాడులు చేసినా ఇరాన్ అణు బాంబుల తయారీ సామాగ్రి చెక్కుచెదరలేదని స్వల్పంగా కొన్ని యంత్రాలు మాత్రమే ధ్వంసమయ్యాయని స్వయంగా అమెరికా ఇంటెలిజెన్స్ తన రిపోర్ట్ లో తెలిపింది. అయితే ఇంతవరకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తమ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై చేసిన దాడులు పూర్తిగా విజయవంతమైందని గొప్పగా ప్రకటించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ దాడులు దాదాపు వృధా అని ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ సోమవారం రాత్రి విడుదల చేసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం.. ఇరన్ లోని మూడు ముఖ్యమైన అణుస్థావరాలైన ఫార్‌డౌ, నతాంజ్, ఇస్‌ఫహాన్ లను బాంబు దాడులు చేసి ఇరాన్ అణు ప్రయోగాలన్నీ విఫలమని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు తప్పు అని తేలింది.
అయితే ఇదే అమెరికా ఇంటెలిజెన్స్ జనవరి 2025లో ఇరాన్ అణు బాంబులు తయారు చేయడం లేదని కేవలం యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ చేస్తున్నాయని తెలిపింది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడులు విఫలమయ్యాయని.. ఇరాన్ వద్ద యురేనియం నిక్షేపాలు చెక్కుచెదరలేదని చెప్పింది. ఆ యురేనియంలో కనీసం పది న్యూక్లియర్ బాంబు తయారు చేసే సామర్థ్యం ఇరాన్ వద్ద ఉన్నాయని కూడా తెలిపింది. యురేనియం నుంచి అణుబాంబులు తయారు చేసే ప్రయోగం కోసం ఉపయోగించే సెంట్రిఫ్యూజ్ యంత్రాలు కూడా ఇరాన్ వద్ద భద్రంగా ఉన్నాయని ఈ తాజా రిపోర్ట్ లో వెల్లడైంది.
అమెరికా దాడులు చేసే ముందే ఇరాన్ ఆ యురేనియం నిక్షేపాలను మరో సురక్షిత ప్రదేశానికి తరలించిందని కూడా మరో నివేదిక ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు ఇరాన్ అణుబాంబులు తయారు చేసే ఉద్దేశం ఉన్నా.. అణుస్థావరాల సిస్టమ్స్ దెబ్బ తినడంతో ఇరాన్ అణు బాంబులు తయారు చేయాలన్నా.. కొన్ని నెలల వ్యవధి పడుతుందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు నివేదించారు.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా అబద్ధం.. వైట్ హౌస్
ఇరాన్ అణు స్థావరాల గురించి అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ని అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ అధికారికంగా తిరస్కరించింది. ఇవన్నీ తప్పుడు అంచనాలతో జారీ చేసిన రిపోర్ట్ అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలీన్ లీవిట్ అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ పరువు దెబ్బతీసేందుకు, అమెరికా యుద్ధ విమాన పైలట్లను అవమానించేందుకు ఈ తప్పుడు రిపోర్ట్ జారీ చేశారని ఆమె అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read: విజయం మాదేనంటూ ఇరాన్, ఇజ్రాయెల్ ప్రకటనలు.. ఏం సాధించారు?
30,000 వేల పౌండ్లు బరువు గల 14 బాంబులతో దాడులు చేస్తే ఎంత వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు, అని వ్యంగ్యంగా మాట్లాడారు.
మరోవైపు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ నివేదికను తప్పుబట్టారు. ఇదంతా ఫేక్ న్యూస్ అంటూ ట్రూత్ సోషల్ లో ఓ పోస్ట్ చేశారు.