Trump Panama Canal | పనామా కెనాల్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండిపట్టుతో కొంత మేరకు విజయం సాధించారు. ఈ విషయంలో తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా యుద్ధ నౌకలు పనామా కెనాల్ నుంచి ప్రయాణించేటప్పుడు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పనామా అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా ప్రభుత్వ నౌకలకు భారీ మొత్తంలో ఖర్చు మిగులుతుందని కూడా తెలిపారు. అదే సమయంలో పనామా నుంచి వచ్చే అక్రమ వలసదారుల విషయంలో తీవ్రంగా చర్యలు తీసుకుంటోందని కూడా అమెరికా మంత్రి ప్రశంసించారు.
ఈ ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. “అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుండి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు” అని అమెరికా విదేశాంగ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. కొన్ని రోజుల క్రితమే పనామా అమెరికాకు కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) మార్కో రూబియో సూచించారు.
నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత. ట్రంప్ పనామా కెనాల్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో సైనిక శక్తిని కూడా ఉపయోగించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ఈ విషయం పనామాలో ఆందోళనకు కారణమైంది.
Also Read: ట్రంప్ ఆ పని చేయెద్దు.. హెచ్చరించిన మిత్రులు, శత్రువులు
అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా కెనాల్ నుంచే ప్రయాణిస్తాయి. ఇక్కడ చైనా సంస్థలు ఓడరేవుల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ట్రంప్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో తీవ్రంగా విమర్శించారు. ఈ ఒత్తిడికి లొంగి, పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వరేలా చైనా సంస్థ బీఆర్ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులను పునరుద్ధరించుకునేలా చేసారు. ట్రంప్ ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. పనామా కొన్ని విషయాల్లో అంగీకరించడంతో ఆయన కొంత మెత్తబడ్డారు.
1914లో అమెరికా అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపేందుకు పనామా కెనాల్‌ను భారీ వ్యయంతో నిర్మించింది. ప్రారంభంలో ఈ కెనాల్‌ను అమెరికానే నిర్వహించింది. కానీ, పనామాలో ఈ కెనాల్‌పై తీవ్ర అసంతృప్తి ఉండడంతో, 1977లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పనామాకు కెనాల్‌ను పనామా దేశానికే అప్పగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం, కెనాల్ తటస్థంగా ఉండాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా, దానిని రక్షించుకునే హక్కు అమెరికాకు ఉందని కూడా పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కెనాల్ అభివృద్ధికి భారీ మొత్తంలో ఖర్చు చేసింది.
యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి ట్రంప్ గుడ్‌బై
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా వైదొలగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, ఇప్పుడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై మంగళవారం ఆయన సంతకం చేశారు. “రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నివారించి, అంతర్జాతీయ శాంతి, భద్రతను స్థాపించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి స్థాపనలో అమెరికా సహాయపడింది. కానీ ఐక్యరాజ్యసమితికి చెందిన అనేక ఏజెన్సీలు సంస్థ లక్ష్యాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నాయి” అని ట్రంప్ తన ఆర్డర్‌లో వివరించారు. పాలస్తీనా శరణార్థులకు యూఎన్‌హెచ్‌ఆర్‌సీ అందించే సహాయానికి అమెరికా నిధులను తక్షణం నిలిపేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా, యునెస్కో, యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ వంటి సంస్థలలో అమెరికా సభ్యత్వం అవసరమా అని పరిశీలించాలని కూడా ఆయన సూచించారు. చైనా, ఇరాన్, క్యూబాలు ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌ను అడ్డుపెట్టుకుని రక్షణ పొందుతున్నాయని ఆయన ఆరోపించారు.
“మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే వ్యక్తులను యూఎన్‌హెచ్‌ఆర్‌సీ రక్షిస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ ఇటీవలే ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన కొన్ని సంస్థలు యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏలో చొరబడ్డాయి. యునెస్కో తనను తాను సంస్కరించుకోవడంలో విఫలమైంది” అని ట్రంప్ తన ఆర్డర్‌లో విమర్శించారు. గాజా యుద్ధం విషయంలో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇజ్రాయెల్, అమెరికాపై అనుచితంగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఇంతకాలం ఖండిస్తూ.. ఐరాస తీరును తప్పుబట్టింది. కానీ బైడెన్ ప్రభుత్వం మాత్రం మౌనం వహించింది. ఇప్పుడు ట్రంప్ మాత్రం తన ప్రధాన కార్యకాలంలోనే యూఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు అమెరికా నిధులను కూడా నిలిపేశారు.