Gaza Takeover Trump | ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రత్యేకంగా సమావేశమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గాజాను అమెరికా ఆక్రమించుకుంటుదని వ్యాఖ్యలు చేయగా.. అమెరికా శత్రు దేశాలతో పాటు, దాని మిత్ర దేశాలు కూడా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించాయి. గాజాను ఆక్రమించుకోవడం ప్రమాదకరమని.. అలా చేస్తే.. అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన చేసినట్లేనని హెచ్చరించాయి.
ట్రంప్ ఏమన్నారంటే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుని, దాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని సంచలన ప్రకటన చేశారు. గాజాలోని 20 లక్షల పాలస్తీనావాసులను అక్కడి నుంచి తరలించాలని స్పష్టం చేశారు. ఈజిప్టు, జోర్డాన్, తుర్కియే వంటి దేశాలు వారిని అక్కున చేర్చుకోవాలని సూచించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో సమావేశమైన ట్రంప్, గాజా ప్రస్తుతం శ్మశానసమానంగా మారిందని, దాన్ని సంపన్నమైన ఆర్థిక కేంద్రంగా మార్చేందుకు అమెరికా సిద్ధమని తెలిపారు.
Also Read: నన్ను చంపాలనుకుంటే సర్వనాశనం అయిపోతారు.. ఇరాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్
గాజా అంశంపై ట్రంప్ ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత
అయితే ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనకు గురైంది. ట్రంప్ చేసిన గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటన తీవ్రంగా వ్యతిరేకించబడింది. ఈజిప్టు, పాలస్తీనా అథారిటీ, తుర్కియే, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అనేక దేశాలు ఈ ప్రతిపాదనను ఖండించాయి. పాలస్తీనా ప్రజలను బలవంతంగా తరలించడం అనాగరికమని చైనా పేర్కొంది. పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యకు పరిష్కారం రెండు దేశాలుగా విడిపోవడమేనని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని దెబ్బతీయొద్దని, పాలస్తీనా రాజ్య స్థాపనకు మద్దతుగా నిలవాలని అరబ్ దేశాలు ఒక ప్రకటనలో తెలిపాయి. సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్, యూఏఈ, ఖతార్, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ట్రంప్ ప్రకటనను ఖండించాయి. ట్రంప్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హమాస్ సీనియర్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ మండిపడ్డారు. ఇది మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు. అమెరికా మిత్రదేశాలు ఇదే విషయాన్ని నొక్కి చెప్పాయి. జర్మనీ, యుకె, ఫ్రాన్స్, కెనెడా లాంటి దేశాలు ట్రంప్ అలా చేస్తే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన చేసినట్లేనని ప్రకటించాయి. తాము ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకమని తెలిపాయి. భారతదేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ మాట్లాడుతూ.. ట్రంప్ అలా చేస్తే చాలా ప్రమాదరకరమని అభిప్రాయపడ్డారు.
గాజా విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రకటన
ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ స్పందిస్తూ, పాలస్తీనీయులకు తమ స్వంత భూమిలో జీవించే హక్కు ఉంది అని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సిన అవసరం ఉందని, జాతి ప్రక్షాళనను అరికట్టాలని పిలుపునిచ్చారు. గాజా ప్రజలు ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని.. ఇప్పటికైనా వారి హక్కులను గౌరవించాలని కోరారు.
ట్రంప్ వ్యాఖ్యలపై గాజా పౌరులు తమ భూమిని వదులుకోబోమని తేల్చిచెప్పారు. “మా ఇళ్లను విడిచిపెట్టము, గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం” అని తెలిపారు. ట్రంప్ ప్రతిపాదన మరింత ఘర్షణలకు దారితీస్తుందని హెచ్చరించారు.
1948 పునరావృతం భయం
1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుతో ఏడు లక్షల మంది పాలస్తీనా వాసులు తమ ఇళ్లు, భూములను వదిలి నిరాశ్రయులైన ఘటన మళ్లీ పునరావృతమవుతుందనే భయం గాజా ప్రజల్లో ఉంది. ట్రంప్ ప్రకటన పాలస్తీనీయుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.