వెనిజులాలోకి చొరబడి.. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకుపోయి.. యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అమెరికా. అంతేకాకుండా.. ఇక ఆ దేశ బాధ్యతలన్నీ తమవే అంటూ గర్వంగా ప్రకటించుకుంది కూడా. అయితే, ఆ రోజు ఏం జరిగింది? అసలు అమెరికా ఎలా చొరబడి.. వెనిజులా అధ్యక్షుడికి అపహరించింది? ఎంతమందిని మట్టుబెట్టిందనే వివరాలేవీ ఇప్పటివరకు బయటకు రాలేదు. తాజాగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వ్లాదిమర్ ప్యాడ్రినో మీడియా ముందుకు వచ్చి.. కీలక విషయాలు వెల్లడించారు.
జనవరి 3వ తేదీన అమెరికా జరిపిన ఆకస్మిక దాడుల్లో 83 మంది చనిపోయారని, వీరిలో 9 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 112 మంది తీవ్రంగా గాయపడ్డారని ప్యాడ్రినో పేర్కొన్నారు. చనిపోయిన సైనికుల్లో 32 మంద క్యూబాకు చెందిన కామ్రేడ్లు ఉన్నట్లు వెల్లడించారు. దేశంలోకి ప్రవేశిస్తూనే అమెరికా సైన్యం బాంబులతో విరుచుకుపడిందని, ఆ వెంటనే అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను బంధించారని వివరించారు. శుక్రవారం జరిగిన సంతాప సభలో ప్రాణత్యాగం చేసిన సైనికులకు నివాళులు అర్పించారు. అయితే, అమెరికా ఆ రోజు విసిరిన బాంబుల వల్ల శవాలన్నీ ఛిద్రమైపోయాయని, ముక్కలుగా ఎగిరిపడ్డాయని తెలిసింది. వాటికి డీఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతే గుర్తించగలిగారట.
వెనిజులాలోకి చొరబడాలనే ఆలోచన ఇప్పటిది కాదట. 2017లోనే ట్రంప్ దీనికి ప్లాన్ చేసినట్లు సమాచారం. కొలబియా మాజీ అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ శాంతోస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘ట్రంప్ అమెరికాకు ఫస్ట్ టెర్మ్ అధ్యక్షుడు అయినప్పుడే దీనిపై ప్లాన్ చేశాడు. ఈ మేరకు లాటిన్ అమెరికా లీడర్లతో న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగులో ట్రంప్ వ్యగ్యంగా మాట్లాడుతూ.. వెనిజులాను చూడండి, దాన్ని మనం చొరబాటుతోనే సరిచేయగలం అని అన్నాడు’’ అని శాంతోస్ తెలిపారు. శాంతోస్ 2010 నుంచి 2018 వరకు కొలంబియాకు అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆ దేశ రెబల్ ఆర్మీ FARCతో శాంతియుత చర్చలు జరిపినందుకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.
మొత్తానికి ట్రంప్ ఎనిమిదేళ్ల ఎదురుచూపు తర్వాత.. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. అప్పటి ప్లాన్‌ను మరిచిపోకుండా అమల్లోకి పెట్టి ఆశ్చర్యపరిచాడు. అమెరికాలో డ్రగ్స్ వ్యాప్తికి ఆ దేశాన్ని బూచిగా చూపిస్తూ తన కోరికను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన చూపు గ్రీన్‌ల్యాండ్ తదితర దేశాలపై పడింది. మున్ముందు మన శాంతి దూత ఇంకేమి చేస్తాడో చూడాలి.
Also Read: గడ్డకట్టిన సరస్సుపై నడక.. ఇద్దరు మృతి, కెమేరాకు చిక్కిన ఘటన