
Thangaraju: మాములుగా కేజీ గంజాయి తరలిస్తూ పట్టుబడితే ఇండియాలో ఏం చేస్తారు? ఓ కేసు బుక్ చేస్తారు.. నాలుగు రోజులు జైల్లో పడేస్తారు. కానీ సింగపూర్ లో అలా కాదు. ఆ వ్యక్తిని ఏకంగా ఉరికంబానికి వేలాడదీసింది. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షా? అన్న డౌట్ వద్దు. చిన్నదా? పెద్దదా? కాదు.. తప్పు తప్పే అంటోంది సింగపూర్ ప్రభుత్వం.
తంగరాజు సుప్పయ్య.. భారత సంతతికి చెందిన వ్యక్తి. గంజాయి అక్రమ రవాణా కేసులో అడ్డంగా దొరికిపోవడంతో అతడిని ఉరికంబం ఎక్కించింది సింగపూర్ కోర్టు. ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు తంగరాజు అనేక సార్లు కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు.. అయినా పట్టించుకోలేదు. సరైన వివరణ లేదంటూ కొట్టేసింది అక్కడి కోర్టు. వివిధ హక్కుల సంఘాలు శిక్షను తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి.. పట్టించుకోలేదు. ఐక్యరాజ్యసమితితో సహా అనేక దేశాలు వెనక్కి తగ్గాలని కోరాయి.. వినిపించుకోలేదు. ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్టుగా గుట్టుచప్పుడు కాకుండా తంగరాజును ఉరితీసి.. అతడి డెత్ సర్టిఫికేట్ ను అతని ఫ్యామిలీ చేతిలో పెట్టింది. మనుషులను నాశనం చేసే డ్రగ్స్ విషయంలో సింగపూర్ ఎంత సీరియస్ గా ఉంటుందనే విషయానికి ఈ కేసే పెద్ద ఉదాహరణ.
ఇదే పరిస్థితి ఇండియాలో జరిగితే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దొరికితే కేసులు. ఏళ్లకు ఏళ్ల విచారణ. నామమాత్రపు శిక్ష. అందుకే భారత్ లో గంజాయి గబ్బు రేపుతోందనే విమర్శలు ఉన్నాయి. అదే సింగపూర్ లో అలా కాదు. డ్రగ్స్.. కరప్షన్.. అన్న పేరు వినిపిస్తే చాలు.. బెండు తీస్తోంది సింగపూర్ ప్రభుత్వం. యువత పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఎంత కఠిన చర్యలకైనా సింగపూర్ వెనుకాడదు. దేశం బాగుపడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని సింగపూర్ చెప్పకనే చెబుతోంది.