జెఫ్రీ ఎప్‌స్టీన్. 2019లో జైలులోనే ఇతను చనిపోయినా.. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికాను కుదిపేస్తోంది. అవును, ఏకంగా ప్రభుత్వాధినేతనే మార్చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్దిచెప్పుకోవాలని చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అసలెవరీ ఎప్‌స్టీన్. ఆయన చేసిన తప్పేంటి..? అందులో డొనాల్డ్ ట్రంప్ వాటా ఎంత..?
ఎవరీ ఎప్‌స్టీన్..?
జెఫ్రీ ఎప్‌స్టీన్ న్యూయార్క్ కి చెందిన ఓ పెట్టుబడిదారుడు. కాలేజీ చదువు లేకపోయినా ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేశాడు. ఆ తర్వాత హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో పరిచయం పెంచుకుని వారికి అమ్మాయిల్ని సరఫరా చేసేవాడు. ఆయన కస్టమర్ల లిస్ట్ లో సినీ తారలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అమ్మాయిల్ని ట్రాప్ చేసి ధనవంతుల దగ్గరకు పంపించే ఎప్‌స్టీన్.. కొన్నాళ్లపాటు ఈ వ్యవహారాన్ని ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేశాడు. సొంత ఫ్లైట్, సొంత ఐలాండ్ ఇతడికి ఉన్నాయి. ఇతని కస్టమర్లంతా హై ప్రొఫైల్ వ్యక్తులు కావడంతో ఎవరూ ఇతడ్ని టచ్ చేసే సాహసం చేయలేదు. కానీ 2005లో తన కుమార్తెని లైంగికంగా వేధించాడంటూ ఎప్‌స్టీన్ పై పోలీస్ కేసు పెట్టాడు. ఆ తర్వాత మరో సేకు నమోదైంది. ఏడాదిపాటు జైలు జీవితం గడిపి వచ్చాడు ఎప్‌స్టీన్. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. ఇక 2019లో ఇతని పాపం పండింది. మరోసారి జైలుకి వెళ్లాడు. ఈ సారి నేరారోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. రిమాండ్ ఖైదీగా జైలులో ఉండగానే అనుమానాస్పద స్థితిలో మరణించాడు.
ఎలా చనిపోయాడు..?
ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేల్చింది. కోర్టు కూడా అదే నిజమని నిర్థారించి కేసు కొట్టివేసింది. కానీ ఎప్ స్టీన్ తరపు లాయర్లు మాత్రం అది హత్యేనని ఆరోపించారు. కానీ నిరూపించలేకపోయారు.
ఎప్‌స్టీన్ కస్టమర్లు ఎవరు..?
ఎప్‌స్టీన్ కు ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు కస్టమర్లుగా ఉన్నారని ఆరోపణలున్నాయి. వారందర్నీ అప్పుడప్పుడు తన ప్రైవేట్ విమానంలో ఎక్కించుకుని ఐల్యాండ్ కి తీసుకెళ్లి అక్కడ చీకటి వ్యవహారాలు నడిపేవాడు. అంతా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుండటంతో సెలబ్రిటీలు సైతం ఎప్‌స్టీన్ ని నమ్మారు. కానీ ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని గ్రహించిన ఎప్‌స్టీన్ అందరి జాతకాలు తన దగ్గర పెట్టుకున్నాడు. ఎప్‌స్టీన్ కేసులో విచారణ జరిపిన పోలీసులు ఈ సమాచారాన్నంతా సేకరించారు. ఎవరెవరు ఎప్‌స్టీన్ ఫ్లైట్ లో తిరిగేవారు, ఐల్యాండ్ కి వెళ్లేవారు. ఎప్‌స్టీన్ పార్టీలకు ఎవరు ఎక్కువగా హాజరయ్యేవారు..? ఇలాంటి వ్యవహారాలన్నీ ఎప్‌స్టీన్ ఫైల్స్ లో ఉన్నాయి. ఈ ఫైల్స్ బయటపడితే బడా బాబులకు తిప్పలు తప్పవని తెలుస్తోంది.
మస్క్ పేల్చిన బాంబు..
ఎప్‌స్టీన్ చనిపోయిన తర్వాత కూడా ఆ ఫైళ్లు ఇప్పటి వరకు బయటపడలేదంటే పోలీసులపై, ఇతర అధికారులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్‌స్టీన్ మరణంపై కూడా అనుమానాలు వచ్చాయి. ఇన్నాళ్లకు మళ్లీ ఎలన్ మస్క్ వల్ల ఎప్‌స్టీన్ ఫైల్స్ అనే పేరు బయటకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ తో ఎప్‌స్టీన్ కలసి ఉన్న పాత ఫొటోలు కూడా సర్కులేట్ అవుతున్నాయి. నిజంగానే ఎలన్ మస్క్ బాంబు పేల్చినట్టయింది. తాజా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే కాదు, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా ఎప్‌స్టీన్ కస్టమర్లేనని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ ఫైల్స్ ని బయటపెట్టలేమంటున్నారు. చాలామంది చిన్నారులు, యువతులకు చెందిన రహస్య సమాచారం ఇందులో ఉందని, ఇది బయటకు వస్తే వారి ప్రైవసీకి భంగం కలిగినట్టు అవుతుందని అంటున్నారు. అందుకే ఆ ఫైల్స్ ని బయట పెట్టలేమని తేల్చేశారు. అయితే ఎలన్ మస్క్ మాత్రం ట్రంప్ కావాలనే వాటిని ఆపుతుతున్నారని ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ బయట పెడితే ట్రంప్ బండారం కూడా బయటపడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు మస్క్.