Israel : ఐరన్ డోమ్. నిన్నామొన్నటి వరకు ఇదో ఛాంపియన్. గగనతల రక్షణ వ్యవస్థలో దీన్ని మించింది లేదన్నారు. పాలస్తీనాతో యుద్ధంలో నిజంగానే గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. హమాస్, హిజ్బుల్లా రాకెట్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ ఆకాశాన్ని శత్రుదుర్బేధ్యంగా మార్చేసింది. ఆ సమయంలో ఐరన్ డోమ్‌ను చూసి అంతా ఆహా ఓహో అన్నారు. కట్ చేస్తే.. ఇరాన్ అటాక్స్ ముందు అదే ఐరన్ డోమ్ తుస్సు మంది. డోమ్‌కు చిల్లులు పడింది. ఇరాన్ మిస్సైల్స్‌ను కాచుకోలేకపోతోంది. ఇజ్రాయెల్‌కు తీవ్ర నష్టం తప్పట్లేదు. ఇంతకీ ఆ పవర్‌ఫుల్ ఐరన్ డోమ్‌కు అసలేమైంది? ఎందుకలా చేతులెత్తేసింది?
ఐరన్ డోమ్ అంటే ఏంటి?
శత్రు దేశాలు సంధించే రాకెట్లు, క్షిపణులను గుర్తించి వాటిని గాలిలోనే పేల్చేసే అత్యాధునిక వ్యవస్థ ఐరన్ డోమ్. రాడార్ సహాయంతో టార్గెట్స్‌ను గుర్తిస్తుంది. వెంటనే ‘తమిర్’ మిస్సైల్స్‌ను ప్రయోగించి వాటిని నాశనం చేస్తుంది. ఈ సెక్యూరిటీ సిస్టమ్ స్వల్ప శ్రేణి, నెమ్మదిగా ఎగిరే క్షిపణులను అడ్డుకోవడంలో పర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. అదే దీర్ఘ శ్రేణి, వేగంగా ప్రయాణించే మిస్సైల్స్‌ను అంత సమర్థవంతంగా ఎదుర్కోలేదు. ఇరాన్ విషయంలో అదే జరిగింది. ఇలాంటి పెద్ద సైజు క్షిపణుల కోసం ఆరో, డేవిడ్ స్లింగ్ లాంటి ఇతర డిఫెన్స్ మెకానిజం ఉన్నా.. వాటిని కూడా ఇరాన్ వెపన్స్ బోల్తా కొట్టిస్తున్నాయి.
ఇరాన్ వ్యూహం ఇదే..
ఇరాన్ ఒకేసారి వందలాది క్షిపణులను ప్రయోగించి.. ఐరన్ డోమ్‌కు ఛాలెంజెస్ విసురుతోంది. అలాంటి మూకుమ్మడి దాడిని డోన్ తట్టుకోలేదు. ఒక క్షిపణిని అడ్డుకోవడానికి ఒకటి, రెండు ఇంటర్‌సెప్టర్లు అవసరం అవుతుంది. అలాంటిది వందలాది డ్రోన్లు విరుచుకుపడితే.. అంతకుమించి ఎక్కువ ఇంటర్‌సెప్టర్లతో రివర్స్ అటాక్ చేయాలి. అక్కడే అసలు సమస్య తలెత్తుతోంది.
ఆ క్షిపణులు అంత డేంజరా?
ఇరాన్ క్షిపణులు ఐరన్ డోమ్ సాధారణంగా ఆపే రాకెట్ల కంటే వేగంగా ఉంటాయి. కొన్ని బాలిస్టిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే 15 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న “ఫతా” క్షిపణి లాంటివి వెంటవెంటనే దిశను మార్చే్స్తూ ఐరన్ డోమ్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. మరోవైపు, డెకాయ్ మిస్సైల్స్‌ను సైతం వదులుతోంది. అంటే అవి ఉత్తుత్తి మిస్సైల్స్ అన్నమాట. ఇవి ఐరన్ డోమ్‌ను రెచ్చగొట్టి వాటిపై ఇంటర్‌సెప్టర్‌లను ప్రయోగించేలా చేసి.. ఐరన్ డోమ్ ఆయుధాలను వేస్ట్ చేస్తుంది. ఆ గ్యాప్‌లో దీర్ఘశ్రేణి క్షిపణులను సంధించి ఇజ్రాయెల్‌లోని టార్గెట్స్‌ను దెబ్బ కొడుతోంది. ఇటీవల ఇరాన్ క్షిపణులు టెల్ అవీవ్, హైఫా, బీర్షెబాలోని సోరోకా మెడికల్ సెంటర్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను ధ్వంసం చేశాయి. ఐరన్ డోమ్‌కు 80–90% రాకెట్లను ఆపే శక్తి ఉంది. కానీ, వరుస వైఫల్యాలతో ఈ సక్సెస్‌రేట్ ఏకంగా 65 శాతానికి పడిపోయింది.
ఖర్చు తడిసి మోపెడు..
ఇరాన్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్‌కు తలకు మించిన భారంగా మారుతోంది. క్షిపణులను గాల్లోనే పేల్చేసేందుకు వాడే ఇంటర్‌సెప్టర్‌లు, మిస్సైల్స్ చాలా ఖరీదైనవి. వీటి ధర చాలా ఎక్కువ. ఒక్కో షాట్‌కు దాదాపు 3 మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుంది. అలా లెక్కేస్తే.. ఒక్క రాత్రికి ఐరన్ డోమ్‌కు అయ్యే ఖర్చు సుమారు 285 మిలియన్ డాలర్లు. ఇంతటి ఖరీదైన యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఎంత కాలం కొనసాగించగలదనేదే డౌట్.
ఇజ్రాయెల్ దీనిని పరిష్కరించగలదా?
ఇజ్రాయెల్ తన రక్షణను మెరుగుపరచుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. అమెరికా సైతం థాడ్, పేట్రియాట్ లాంటి వ్యవస్థలతో మిత్రదేశానికి సహాయం చేస్తోంది. ఐరన్ డోమ్ ఇప్పటికీ బలంగా ఉందని, అయితే ఇరాన్ ప్రయోగించే వేగవంతమైన క్షిపణులను ఆపడానికి మరిన్ని ఇంటర్‌సెప్టర్లు అవసరమని నిపుణులు అంటున్నారు. ముప్పును తగ్గించడానికి ఇజ్రాయెల్ ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అటాక్ చేసి.. తమపై దాడి చేయకుండా దెబ్బకొడుతోంది. ఐరన్ డోమ్‌కు మించిన యుద్ధ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. డిఫెన్స్ కంటే కూడా అటాక్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది.