Matrimony Fraud| ఇండియాలో మూడు వ్యాపారాలకు ఎప్పుడూ క్రేజ్. సినిమాలు, క్రికెట్, పెళ్లిళ్లు. వీటిలో పెట్టుబడి లేకుండా భారీ లాభాలు పొందే బిజినెస్ మ్యాట్రీమోనీ. కాబోయే వధూవరుల కోసం మ్యాచింగ్ చేయడం. వారి కోరుకుంటున్నట్లు ఉండే వ్యక్తులను వారి కోసం వెతికి పెట్టడమే పని. ఒకప్పుడు ఈ పనికోసం సంబంధాలు చూసే పెళ్లిళ్ల పేరయ్యాలు ఉండేవారు. కానీ ఇప్పుడు వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. వారి స్థానంలో ఏజెన్సీలు, ఆన్ లైన్ మ్యాట్రీమోనీలు వచ్చేశాయి. ఇప్పుడంతా డిజిటల్ యుగం కావడంతో ఈ బిజినెస్ విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. దీంతో పాటే ఈ రంగంలో మోసాలు కూడా ఎక్కువైపోయాయి.
చైనాలో అయితే ఈ బిజినెస్ లో మోసాలు చేసే ఏజెన్సీలు గురించి ఎక్కువగా వార్తలొస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీలపై నిఘా పెంచింది. చైనాకు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనం ప్రకారం.. పోలీసులు గత కొంతకాలంగా మాట్రిమోనీ ఏజెన్సీలపై దాడులు చేశారు. ఈ ఏజెన్సీలన్నీ యువకులను టార్గెట్ చేస్తున్నాయని అని పోలీసుల విచారణలో తేలింది. మార్చి 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు ఒక్క గుయిజౌ రాష్ట్రంలో 180 మంది యువకులు తాము మోసపోయామని ఈ మ్యాటీమెనీ ఏజెన్సీలపై కేసులు వేశారని సమాచారం.
ఈ మ్యాట్రీమోనీ ఏజెన్సీలు అందమైన యువతలను చూపించి యువకులను ఆకర్షిస్తారు. ముఖ్యంగా పెళ్లి కోసం ఆత్రుత పడే యువకులే వీరి టార్గెట్. ముందుగా ఏజెన్సీ తరపున ఒక యువతితో పెళ్లిసంబంధం కోసం ప్రయత్నిస్తున్న యువకుడికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత ఇద్దరూ తరుచూ డేటింగ్ చేసుకుంటారు. ఈ లోపు యువకుడి వద్ద ఆ చార్జీలు, ఈ ఖర్చుల కోసమని భారీగా వసూలు చేస్తారు. చివరికి ఆ యువతికి మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైందని చెప్పి మరో యువతిని చూపిస్తారు. ఈ క్రమంలో ఈ మ్యాట్రిమోనీ ఏజెన్సీలతో పాటు వారి వద్ద పనిచేసే యువతులు కూడా బాగా సంపాదిస్తున్నారు.
చైనాలో ఫ్లాష్ మ్యారేజీలు, విడాకులు
పోలీసులు విచారణలో పట్టుబడిన ఒక యువతి తన నేరం అంగీకరిస్తూ.. ఒక కేసు ఉదహారణగా చెప్పింది. గత మూడు నెలల్లో ఒక యువకుడికి కాబోయే భార్యగా నటించి అతని వద్ద నుంచి 3 లక్షల యుఆన్లు (భారత కరెన్సీ రూ.35 లక్షలు) దోచుకున్నట్లు తెలిపింది. తనలాగా చాలా మంది యువతులు మధ్య తరగతి, ఎగువ తరగతి యువకులు, రెండో వివాహం కోసం ప్రయత్నిస్తున్న పురుషులను ఏజెన్సీ సాయంతో ట్రాప్ చేస్తున్నట్లు వెల్లడించింది.
పెళ్లికూతురు కావాలని సంప్రదించే యువకుడితో ముందుగా ఈ మ్యాట్రీమోనీ ఏజన్సీలు ఒక కాంట్రాక్టు చేసుకుంటాయి. ఈ కాంట్రాక్టు సమయంలోనే అడ్వాన్స్ ఫీజుగా 10,000 నుంచి 30,000 యుఆన్లు తీసుకుంటారు. అయితే పెళ్లికి ముందు బాగా ఖర్చు చేయించి ఆ తరువాత కొన్ని కేసుల్లో పెళ్లి అయిన తరువాత పెళ్లికూతరు పారిపోవడం లేదా భర్తతో గొడవలు పడి విడాకులు తీసుకోవడం జరుగుతుంది. విడాకులులో భాగంగా భర్త నుంచి భారీగా భరణం కూడా వసూలు చేస్తారు. ఆ తరువాత మరో బక్రా యువకుడి వేటలో పడతారు.
ఈ మ్యాట్రిమోనీ ఏజెన్సీలలో పనిచేసే ఒక కస్టమర్ సర్వీస్ ప్రతినిధి కూడా తన నేరం అంగీకరించాడు. మ్యాట్రిమోనీ ఏజెన్సీలకు వచ్చే వారిలో పురుషలే ఎక్కువని.. అందుకోసం వారిలో బాగా ఆస్తిపరులైన వ్యక్తిని ముందుగా టార్గెట్ చేస్తామని తెలిపాడు.