Bangladesh Elections| బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలిక చీఫ్, సలహాదారుడు ముహమ్మద్ యూనుస్ దేశంలో తదుపరి ఎన్నికల గురించి సోమవారం డిసెంబర్ 16, 2024న ప్రకటన చేశారు. ఆగస్టులో బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు చేసిన తిరుగుబాటు తరువాత ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన ముహమ్మద్ యూనుస్ సోమవారం ఒక మీడియా కార్యక్రమంలో ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. 2025 సంవత్సరం చివరిలో లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని తెలిపారు.
మైక్రో ఫైనాన్స్ రంగంలో నోబెల్ బహుమతి విజేత అయిన 84 ఏళ్ల యూనుస్ ఆగస్టులో ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా సైన్యాధికారుల ద్వారా నియమించబడ్డారు. 17 కోట్లు జనాభా కలిగిన బంగ్లాదేశ్ దేశంలో ప్రజాస్వామ్య విలువలతో కూడిన సంస్థలు తిరిగి ప్రతిష్ఠించడం సవాళ్లతో కూడిన పని అని ముహమ్మద్ యూనుస్ చెప్పారు.
“ఎన్నికల తేదీలు 2025 సంవత్సరం చివరి కల్లా నిర్ణయించబడుతాయి లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో జరుగుతాయి”, అని జాతీయ టెలివిజన్ ఛానెల్ లో ముహమ్మద్ యూనుస్ ప్రకటించారు.
Also Read: ఒక్కొక్కరు కాదు.. 100 మంది పురుషులతో ఒకేసారి ‘ఆ’ పని, మరో 1000 మందితో చేసేందుకు ప్లాన్!
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా (77) ఆగస్టు 2024లో రాజధాని ఢాకా వదిలి ఒక హెలికాప్టర్ లో పలాయనం చేశారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో శరణార్థిగా ఉన్నట్లు సమచారం. అయితే షేక్ హసీనా బయలుదేరిన కొన్ని గంటల వ్యవధిలోనే వేల మంది విద్యార్థులు, నిరసనకారులు ఢాకాలోని ప్రధాన మంత్రి అధికార నివాసంలోకి చొచ్చుకొని పోయారు.
బంగ్లాదేశ్ లో 15 ఏళ్లపాటు సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కోర్టులు, అధికార యంత్రాంగం అంతా అవినీతి మయమైందని ఆరోపణలున్నాయి. షేక్ హసీనా అధికారంలో ఉండగా.. ఎన్నికలు పారదర్శకంగా ఎన్నడూ జరగలేదని విమర్శులున్నాయి. ఆమె రాజకీయ శత్రువులు చాలా మంది హత్యకు గురయ్యారు. మానవ హక్కుల ఉల్లంఘనలు భారీ స్థాయిలోనే జరిగాయి.
ఈ నేపథ్యంలో ముహమ్మద్ యూనుస్ తిరిగి పరిపాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టి.. ఆ తరువాత ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. దేశంలో ఏ సంస్కర్ణలు అవసరమో? తెలుసుకునేందుకు ఆయన కొన్ని కమిటీలు, కమిషన్లు ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి.. అనుకూలమైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
“రాజకీయ పార్టీలన్నీ సంస్కర్ణలతో సంతృప్తి చెందితే.. త్వరగానే ఎన్నికలుంటాయి. వోటర్ల జాబితా అంతా సవ్యంగా ఉంటే నవంబర్ 2025లో ఎన్నికలు నిర్వహిస్తాం. కాకపోతే కొన్ని నెలల ఆలస్యం అయ్యే అవాకాశాలు కూడా ఉన్నాయి.” అని యూనుస్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే బంగ్లాదేశ్ యూనుస్ అధికారం చేజిక్కించుకున్నాక.. పరిపాలన ఇంకా దిగజారిందని ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో మైనారిటీలపై, షేక్ హసీనా పార్టీకి చెందిన రాజకీయ నాయకులపై వారి బంధువుల ఇండ్లపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హింసాత్మకంగా మారుతున్నాయి.