రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతీయ రైల్వే భారీ స్థాయిలో గ్రూప్-D పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది.
భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-D (లెవల్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
విద్యార్హతలు, వయస్సు వివరాలు ఇవే..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి (10th Class) లేదా ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ విధానం ఇదే..
అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): అభ్యర్థుల మేధస్సును పరీక్షించేందుకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
శారీరక సామర్థ్య పరీక్ష (PET): CBTలో అర్హత సాధించిన వారికి శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: విద్యార్హత పత్రాలను తనిఖీ చేస్తారు.
మెడికల్ టెస్ట్: అభ్యర్థి ఆరోగ్య స్థితిగతులను రైల్వే వైద్య ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తారు.
దరఖాస్తు ఫీజు, అఫీషియల్ వెబ్ సైట్ ఇదే..
సాధారణ మరియు ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500 గా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PwBD), మహిళలు, మాజీ సైనికోద్యోగులకు ఫీజులో రాయితీ ఉంటుంది, వారు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.rrbcdg.gov.in/ సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbcdg.gov.in
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 2. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. రైల్వేలో స్థిరమైన భవిష్యత్తును కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.