ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ ఫోన్లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన జేఏసీ ఆటో కంపెనీ… లిథియం-అయాన్ బ్యాటరీలకు ప్రత్యామ్నాయంగా సోడియం-అయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే… లిథియం-అయాన్ బ్యాటరీ కంటే నాలుగు రెట్లు మెరుగ్గా పని చేసే కొత్త బ్యాటరీని కనిపెట్టడం. ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఐఐటీ, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ అర్గోన్ నేషనల్ లాబొరేటరీ పరిశోధకులు… లిథియం-ఎయిర్ బ్యాటరీ డిజైన్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ కంటే నాలుగు రెట్లు మెరుగ్గా పని చేస్తుందని… దీన్ని దేశీయ విమానాలు, దూరప్రాంతాలకు తిరిగే ట్రక్కుల్లో వాడొచ్చని చెబుతున్నారు.
లిథియం-ఎయిర్ బ్యాటరీలో సాధారణ ద్రవ రకానికి బదులుగా ఘన ఎలక్ట్రోలైట్ వాడారు. దీని వల్ల ఇది వేడెక్కడం కానీ, మంటలు చెలరేగడం కానీ జరగదని పరిశోధకులు చెబుతున్నారు. ఘన ఎలక్ట్రోలైట్… బ్యాటరీ శక్తిని లిథియం-అయాన్ బ్యాటరీల కంటే నాలుగు రెట్లు పెంచుతుందని, దీని వల్ల వాహనాలు ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కలుగుతుందని అంటున్నారు. ఈ ఘన ఎలక్ట్రోలైట్ నానోపార్టికల్ రూపంలో… చౌకైన మూలకాలతో తయారు చేసిన సిరామిక్ పాలిమర్ పదార్థంతో కూడి ఉంటుందని పేర్కొన్నారు. ఇది సాధారణ వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని పనిచేస్తుందని, ఆక్సిజన్ ట్యాంక్‌లను ఆపరేట్ చేయాల్సిన అవసరాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. గతంలో చేసిన పరీక్షల్లో లిథియం-ఎయిర్ బ్యాటరీ లైఫ్ సైకిల్ చాలా తక్కువగా ఉందని, ప్రస్తుతం దాన్ని వెయ్యి లైఫ్ సైకిల్స్ స్థాయికి పెంచగలిగామని, దీని వల్ల కొత్త బ్యాటరీల ఉత్పత్తికి ఆటంకం ఉండదని పరిశోధకులు నిర్ధారించారు. చార్జింగ్, డిశ్చారింగ్ విషయంలో లిథియం-ఎయిర్ బ్యాటరీ స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోందని పరీక్షల్లో తేల్చారు. దీని సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా పరీక్షలు జరుపుతామని పరిశోధకులు ప్రకటించారు.