
Arjun Tendulkar : అర్జున్ టెండూల్కర్‌కు ద్వితీయ విఘ్నం రాలేదు గానీ… అక్షయ తృతీయ సందర్భంగా తృతీయ విఘ్నం వచ్చి పడింది. ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఆడినప్పుడు 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు… ఫర్వాలేదనిపించాడు. ఇక రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ మీద ఆడినప్పుడు భువనేశ్వర్ వికెట్ తీయగానే శభాష్ అనిపించుకున్నాడు. కాని, మూడో మ్యాచ్‌కి వచ్చే సరికి ఆ పేరంతా పోయినట్టే అనిపిస్తోంది. ఎందుకంటే.. మూడు ఓవర్లు వేసి ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబై బౌలర్స్‌లలో ఇన్ని పరుగులు ఇచ్చిన బౌలర్ లేరు.
నిజానికి ఫస్ట్ 2 ఓవర్లు బాగానే వేశాడు. అఫ్ కోర్స్.. ఫస్ట్ ఓవర్లోనే వైడ్స్ కూడా వేశాడనుకోండి. మొత్తం మూడు ఓవర్లలో 4 వైడ్స్ వేశాడు. ఫస్ట్ 2 ఓవర్స్‌లో చాలా పొదుపుగా 17 రన్స్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ మూడో ఓవర్లో తేలిపోయాడు. ఏకంగా 31 పరుగులు ఇచ్చుకున్నాడు.
అర్జున్ వేసిన 16వ ఓవర్లో పంజాబ్ బ్యాటర్లు శామ్ కరణ్, హర్ ప్రీత్ సింగ్ పరుగుల మోత మోగించారు. శామ్ కరణ్ ఒక సిక్స్, ఒక ఫోర్, హర్ ప్రీత్ మూడు ఫోర్లు ఒక సిక్సుతో విధ్వంసం సృష్టించారు. అర్జున్ ఈ ఓవర్లలో బంతిపై పట్టు కోల్పోయినట్లు కనిపించింది. బంతి ఎటు వేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఓ నో బాల్ కూడా వేశాడు. మొత్తం ఒకే ఓవర్లో 31 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆ దెబ్బకి నాలుగో ఓవర్ ఇవ్వలేదు.
అయితే, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ ఒక్కడే బాధితుడు కాదు.. పంజాబ్ బ్యాట్స్ మెన్ బౌలర్లందరినీ బాదేశారు. కాకపోతే, అక్కడ ఉన్నది అర్జున్ టెండూల్కర్ కాబట్టి… వేళ్లన్నీ అటువైపే చూపిస్తాయి, కళ్లన్నీ అటే చూస్తాయి.
నిజానికి ఈ మ్యాచ్‌కు ముందే రవిశాస్త్రి.. అర్జున్ టెండూల్కర్‌కు కితాబు ఇచ్చాడు. అర్జున్ యార్కర్లు అద్భుతంగా ఉన్నాయని, కీలకమైన ఆఖరి ఓవర్‌లో ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై అర్జున్‌కు పూర్తి క్లారిటీ ఉందని చెప్పుకొచ్చాడు.