Twitter : సోషల్ మీడియాలోకి మరో కొత్త యాప్ దూసుకురాబోతోంది. అది ఎవరిదో కాదు… ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సేదే. దానికి బ్లూ స్కై అనే పేరు పెట్టారు. ట్విట్టర్ కు పోటీగానే దీన్ని తీసుకురాబోతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
బ్లూ స్కైకి సంబంధించిన పని ఇప్పటికే పూర్తైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేటుగా, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు జాక్ డోర్సే స్వయంగా వెల్లడించాడు. ఇది పూర్తి అయితే… దాని పబ్లిక్ బీటా టెస్టింగ్‌ను ప్రారంభిస్తామని తెలిపాడు… జాక్. అథెంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌పై బ్లూ స్కై పనిచేస్తుందని… అంటే ఒక్క సైట్ ద్వారా కాకుండా పలు సైట్ల ద్వారా దీన్ని నడపాల్సి ఉంటుందని జాక్ చెబుతున్నాడు. ఈ ప్రాజెక్టును ముందుగా బ్లూస్కై పేరుతో ప్రారంభించామని… చివరికి కంపెనీ పేరును కూడా బ్లూ స్కై గానే కొనసాగించాలని నిర్ణయించామన్నాడు. బ్లూస్కై అంటే విస్తృతమైన అవకాశాలకు సూచిక అని జాక్ డోర్సే వివరించాడు. ట్విట్టర్ కు పోటీగానే బ్లూ స్కైని రూపొందించారని భావిస్తున్న నెటిజన్లు… అది ఎలా ఉంటుంది? ఎప్పుడు రాబోతుంది? అనే వివరాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.