జీడిపప్పు పకోడీని కాజు పకోడీ అని కూడా అంటారు. ఇది మంచి టైం పాస్ స్నాక్స్‌లా అనిపిస్తుంది. సాయంత్రం పూట కరకరలాడుతూ తినాలనిపిస్తుంది. పైగా జీడిపప్పులు మన శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. ప్రతి స్వీట్ షాప్‌లో కూడా జీడిపప్పు పకోడీ దొరుకుతుంది. కానీ కొందామంటే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంత ఖర్చు పెట్టే కన్నా హాయిగా ఇంట్లోనే దీన్ని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలోనే జీడిపప్పు పకోడీని రెడీ అయిపోతుంది. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
జీడిపప్పు పకోడీకి కావాల్సిన పదార్థాలు
జీడిపప్పులు – 100 గ్రాములు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
శెనగపిండి – 150 గ్రాములు
నెయ్యి – ఒక స్పూను
నీళ్లు – నాలుగు స్పూన్లు
ధనియాల పొడి – అర స్పూను
జీలకర్ర – ఒక స్పూను
కారం – ఒకటిన్నర స్పూను
కరివేపాకులు – గుప్పెడు
గరం మసాలా – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
జీడిపప్పు పకోడీ రెసిపీ
1. జీడిపప్పు పకోడీ చేసేందుకు ముందుగా జీడిపప్పులను ఒక గిన్నెలో వేసి రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి.2. రెండు గంటల తర్వాత జీడిపప్పును నీటిలోంచి తీసి ఒక ప్లేట్ లో వేయాలి.
3. జీడిపప్పులపైనే శెనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం నీళ్లు, నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
4. కరివేపాకులను సన్నగా తరిగి ఇందులో వేయాలి. ఈ మొత్తాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
5. జీడిపప్పు పకోడీ గట్టి పకోడీ రూపంలోనే చేయాలి.
6. కాబట్టి ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఈ పిండి మందంగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
8. హై ఫ్లేమ్ మీద పెట్టి నూనెను వేడెక్కేలా చేయాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి.
9. ఇప్పుడు జీడిపప్పు పకోడీ మిశ్రమాన్ని చేతులతోనే పకోడీల్లా వేసుకోవాలి.
10. మీడియం మంట మీదే ఉంచి పది నిమిషాలు పాటు ఈ పకోడీలను వేయించాలి.
11. ఎందుకంటే లోపల జీడిపప్పులు కూడా క్రిస్పీగా వేగాల్సి ఉంటుంది.
12. అన్ని అలా పకోడీల్లా వేసుకుని తీసి గాలి చొరబడని డబ్బాల్లో వేసి నిల్వ చేసుకోవాలి.
13. అంతే టెస్ట్ జీడిపప్పు పకోడీ రెడీ అయినట్టే. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు ఇష్టంగా తింటారు.
ఈ జీడిపప్పు పకోడీలు క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. మీకు కారంగా కావాలనుకుంటే కారం అధికంగా వేసుకోవచ్చు. లేదా పచ్చిమిర్చిని వేసుకున్నా రుచిగా ఉంటాయి. ఇందులో ఉల్లిపాయల్లాంటివి వేయకూడదు. ఉల్లిపాయలు వేస్తే అవి ఒక రోజు లేదా రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. కాబట్టి జీడిపప్పు పకోడి ఒకసారి చేస్తే పది రోజులు పాటు నిల్వ ఉంటుంది. అందులో ఎలాంటి ఉల్లిపాయలు వేయకూడదు. పచ్చిమిర్చిని వేయవచ్చు. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా జీడిపప్పు పకోడీ చేసి పెడితే మీకు ప్రశంసలు కచ్చితంగా వస్తాయి. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో ప్రయత్నించి చూడండి.
Also Read: అటుకులతో రవ్వ కేసరి ఇలా చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది రెసిపీ ఇదిగో